వలసలతో సతమతమవుతున్న తెలంగాణ కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నారు. మంగళవారం ఉదయం ప్రగతి భవన్‌లో ఆమె ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌లతో సమావేశమయ్యారు.

నర్సాపూర్‌లో జరగనున్న సభలో సునీతా టీఆర్ఎస్‌లో చేరనున్నట్లు ప్రకటించారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నర్సాపూర్ నుంచి పోటీ చేసిన ఆమె టీఆర్ఎస్ అభ్యర్థి చిలుముల మదన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు.

పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేయాలని సునీతా భావించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు టికెట్ నిరాకరించినట్లుగా తెలుస్తోంది. దీంతో అప్పటి నుంచి కాంగ్రెస్ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఆ క్రమంలో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణ‌తో సునీత భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో సునీతా లక్ష్మారెడ్డి బీజేపీలో చేరుతారని, మెదక్ నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఆమె టీఆర్ఎస్‌ వైపు మొగ్గు చూపడంతో కాంగ్రెస్, బీజేపీలు ఖంగుతిన్నాయి.