నల్గొండ: తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు టీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి, మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా చేస్తున్నాయి. టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ గా జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు కాస్త గుత్తా వర్సెస్ కోమటిరెడ్డి అన్నంతగా మారిపోయింది. 

టీఆర్ఎస్ గెలుపు తథ్యమంటూ గుత్తా సుఖేందర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే తమదే గెలుపంటూ కోమటిరెడ్డి బ్రదర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే గుత్తా సుఖేందర్‌రెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మతిభ్రమించి మాట్లాడుతున్నారంటూ ధ్వజమెత్తారు. 

గుత్తా వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. తమను విమర్శించే నైతిక హక్కు గుత్తాకు లేదన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇస్తున్న వరుస షాక్ లతో గుత్తాకు మతిభ్రమించిందని ధ్వజమెత్తారు. 

రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్న పరిణమాలు చూస్తుంటే గుత్తా రాజకీయ జీవితం ముగిసినట్లేనని విమర్శించారు. మంత్రి పదవి కాదు కదా... కనీసం ఎమ్మెల్సీ టికెట్ కూడా రాదేమోనని అనుమానం వ్యక్తం చేశారు. తమకు పదవులపై కోరిక ఉంటే మంత్రి పదవికి రాజీనామా ఎందుకు చేస్తామో గుత్తాయే చెప్పాలని డిమాండ్ చేశారు. 

కాంగ్రెస్ పార్టీని నిలబెట్టేందుకే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మదర్ డైరీని అడ్డంపెట్టుకుని గుత్తా సోదరులు అక్రమాస్తులు కూడ బెట్టారని ఆరోపించారు. దివంగత సీఎం వైయస్ రాజశేఖర్‌రెడ్డితో మాట్లాడి గుత్తాకు ఎంపీ టికెట్ ఇప్పించి గెలిపించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. 

అలాంటిది పార్టీ మారి నీచ రాజకీయాలకు పాల్పడ్డారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బుతో టీఆర్ఎస్ క్యాంపులు పెట్టినా ఓటర్లు మాత్రం తమకే ఓటేస్తారని చెప్పుకొచ్చారు. ఎంపీ, ఎమ్మెల్సీతో పాటు మూడు జడ్పీ ఛైర్మన్లు కాంగ్రెస్‌ పార్టీవేనని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.