నల్లగొండ : తెలంగాణ కోసం తన భర్త పోరాటాలు చేస్తే టీఆర్ఎస్ పార్టీ కక్ష సాధింపుకు పాల్పడుతుందని మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సబిత ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్గొండ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. తన భర్తకు ఓటెయ్యాలని కోరారు. 

తన భర్త కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కక్ష కట్టిందని ప్రజలకు వివరించారు. రాష్ట్రంలో ఎవరూ చేయని విధంగా తన భర్త తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలని కాంగ్రెస్‌ అధిష్టానాన్ని ఒప్పించేందుకు నిరాహార దీక్ష చేశారని చెప్పుకొచ్చారు. 

తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కోమటిరెడ్డిని ఎమ్మెల్యే పదవి నుంచి కూడా కక్షకట్టి సస్పెండ్‌ చేశారని సబిత ఆరోపించారు. నియోజకవర్గంలో ప్రజలు ప్రశాంతంగా ఉండాలంటే, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే తన భర్త కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.