సిద్దిపేట: సిద్ధిపేట నియోజకవర్గంలో మాజీమంత్రి హరీష్ రావు భావోద్వేగానికి గురయ్యారు. ఎన్నికల ఫలితాల అనంతరం బుధవారం సిద్దిపేటలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ ఎన్ని జన్మలెత్తినా సిద్దిపేట ప్రజల రుణం తీర్చుకోలేనిదని చెప్పుకొచ్చారు. తన చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువేనంటూ హరీష్ భావోద్వేగానికి గురయ్యారు. 

సిద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం కార్యకర్తల కృతజ్ఞత సభలో పాల్గొన్న హరీష్ తన జన్మ ఉన్నంత వరకు ప్రజల కోసమే పని చేస్తానని హమీ ఇచ్చారు. దేశంలోనే మొదటి స్థానంలో లక్ష మెజారిటీతో గెలిపించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఘనత సిద్దిపేట ప్రజలది, కార్యకర్తలదని ఆయన అభిప్రాయపడ్డారు. 

ఎవరైనా మంచి నాయకుడు ఉన్నారనుకుంటారు, కానీ నాకు మంచి ప్రజలు దొరికారనిపిస్తుందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిందన్నారు. ప్రజలు తమ మీద నమ్మకం ఉంచి, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు అంతే నమ్మకంతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా తనను కలిసేందుకు వచ్చేవాళ్లకు హరీష్ ఒక విజ్ఞప్తి చేశారు. నాపై అభిమానం ఉన్న వాళ్లు బొకేలు, శాలువాలు తేకుండా చెట్టును పెంచాలని సూచించారు. నాడు ఎన్నికల వల్ల ఆగిపోయిన బతుకమ్మ చీరలు ఇప్పుడు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. 

గతంలో ఎన్నికల ప్రచార సమయంలో కూడా హరీష్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. వర్షంలో తడుస్తూ ప్రజలు తన దగ్గరకు రావడంతో ఈ జన్మకు ఇదిచాలు ఇంకేం కావాలంటూ భావోద్వేగానికి లోనయ్యారు.  

శత్రుసంహారంతోనే ఈ విజయానికి పరిపూర్ణత ఏర్పడుతుందని హరీష్ వ్యాఖ్యానించారు. ఎన్ని జన్మలెత్తిన సిద్దిపేట జనం ఋణం తీర్చుకోలేనన్న ఆయన కార్యకర్తల కృషి వెల కట్టలేనిది అని కొనియాడారు. లక్ష్యం నెరవేరింది లక్ష తో మన బాధ్యత మరింత పెరిగిందన్నారు. 

చరిత్రను తిరగరాసేలా పోలైన ఓట్ల లో 80 శాతం ఓట్లు వేసి రికార్డు మెజారిటీ ఇచ్చారని అన్నారు. ఎంత ఎడిగితే అంత ఒదిగి ఉండాలి అన్నట్లు తాను ఎప్పుడూ అలానే ఉంటానన్నారు. డబ్బు, మద్యం ఎలాంటి ప్రలోభాలకు కాకుండా కేవలం ప్రేమ తో ఓట్లు వేశారన్నారు. 

ఎన్ని జన్మలెత్తినా సిద్ధిపేట నియోజకవర్గ ప్రజల రుణం తీరదు సరికదా ప్రేమ రెట్టింపు అవుతుందన్నారు. నాకు ఎంత శక్తి ఉంటే అంత చేస్తానని అవార్డుల్లో ముందున్నాం అందులో మీ తోడ్పాటు ఉందన్నారు. దేశంలో సిద్దిపేట ఎప్పుడూ ఫస్ట్ స్థానంలో ఉండాలన్నారు. 

ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతీ మాట నెరవేరుస్తానని అదే నా లక్ష్యమన్నారు. సిద్దిపేట మొత్తం కుటుంబం గా భావిందామని ఎవరికి ఏ సమస్య ఉన్న కుటుంబ సమస్య బావించి సరిదిద్దుకుందామన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఉన్నా ఒక్క వాట్సప్ పెడితే తాను చూసుకుంటానని హరీష్ రావు హామీ ఇచ్చారు.