హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఉపసభాపతి పద్మారావు గౌడ్ పై మాజీమంత్రి హరీష్ రావు పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ అసెంబ్లీలో పద్మారావు గౌడ్ ను అభినందిస్తూ పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గత 20ఏళ్లు ఉద్యమ సహచరుడిగా, శాసన సభ్యుడిగా, సహచర మంత్రిగా మీతో కలిసి పనిచేసే అవకాశం దక్కిందన్నారు. 

తమరు ఏ హోదాలో ఉన్నా ఏ పదవిలో ఉన్నా అందరిచేత పజ్జన్నగా ముద్దుగా పిలుచుకునే పేరు పద్మారావు గౌడ్ కే దక్కిందన్నారు. చిన్నా, పెద్ద, కులం, మతం అనే ఏ బేదాభిప్రాయాలు లేకుండా ఉండే వ్యక్తి పద్మారావుగౌడ్ అంటూ చెప్పుకొచ్చారు. 

నియోజకవర్గ కార్యకర్తల నుంచి మంత్రుల వరకు అంతా పజ్జన్న అని మిమ్మల్ని ముద్దుగా పిలుచుకుంటారంటూ గుర్తు చేశారు. మీ చిరునవ్వు ఎప్పుడూ అలాగే ఉండాలని ఆకాంక్షించారు. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో జై తెలంగాణ నినాదం ఇచ్చినప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా ఉద్యమస్పూర్తిని చాటారని కొనియాడారు. 

హరీశ్ మాటలు చెప్తున్నంత సేపు ఉపసభాపతి పద్మారావు గౌడ్ సంబరపడిపోయారు. పజ్జన్న అని హరీశ్ అన్న మాటలకు ముసి ముసి నవ్వులతో మురిసిపోయారు. గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని గుర్తు చేశారు. 

జంట నగరాల్లో కల్లు దుకాణాలను పునరుద్ధరించడంతో పాటు చెట్లరకాన్ని రద్దుచేసిన ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకునే అదృష్టం తమకే దక్కిందన్నారు. అలాగే గీత కార్మికులకు రూ.2లక్షల నుంచి రూ.5 లక్షల వరకు ఎక్స్‌గ్రేషియా పెంచుతూ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారని గుర్తు చేశారు. 

తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా మహమ్మారిని పూర్తిగా నిషేధించడం మీ హయాంలోనే జరిగిందని హరీష్ రావు తెలిపారు. తాటి, ఈత చెట్లపై పన్ను రద్దు చేయడం వల్ల కల్లుగీత కార్మికులకు ఎంతో మేలు చేశారన్నారు. 

క్రీడా శాఖమంత్రిగా ఉన్న సమయంలో సానియామీర్జా, సైనా నెహ్వాల్, పీవీ సింధు గొప్ప అవార్డులను మన రాష్ట్రానికి తీసుకొచ్చి తెలంగాణ ఔన్నత్యాన్ని, గౌరవాన్ని ప్రపంచానికి చాటారని అన్నారు. ఆ ఘనత కూడా మీరు క్రీడల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే జరగడం సంతోషకరమన్నారు. 

డిప్యూటీ స్పీకర్‌గా మీరు తప్పకుండా సభ ఔన్నత్యం, హుందాతనం పెంచడంలో విజయవంతం అవుతారని సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. పద్మారావుగా కార్పొరేటర్ గా, ఎమ్మెల్యేగా, ఎక్సైజ్ శాఖ మంత్రిగా మంచిపేరుతెచ్చుకున్న మీరు డిప్యూటీ స్పీకర్‌గా మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

ఒక పద్మంలాగా వికసిస్తారనే సంపూర్ణమైన విశ్వాసం ఉందని హరీష్ రావు అభిప్రాయపడ్డారు. మీ ఇష్టదైవం కొమరెల్లి మల్లన్న ఆశిస్సులతో మీరు ఈ కొత్త బాధ్యతలో సంపూర్ణంగా విజయవంతమై, మంచి భవిష్యత్తును, గౌరవాన్ని పొంది మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలని ఆ కొమరెల్లి మల్లన్నను మనస్పూర్తిగా ప్రార్థిస్తున్నట్లు హరీష్ తెలిపారు.