శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇవాళ మహాశివునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని ఉమాపార్థివ కోటి లింగాల ఆలయాన్ని మంత్రి కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. 

ఈ సందర్భంగా  ఆలయం వద్ద  హరీష్ రావు మాట్లాడుతూ... రెండవసారి తెలంగాణలో అధికారాన్ని చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు సంక్షేమ పథకాలు సమృద్దిగా అందుతున్నాయన్నారు. ఇదే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ సారథ్యంలో ప్రభుత్వం ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందిస్తారన్నారు. ఇలా తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది చెంది తాము ప్రకటించినట్లు బంగారు తెలంగాణ సాకారం కావాలని ఆ పరమశివున్ని కోరుకున్నట్లు హరీష్ వెల్లడించారు. 

ఇవాళ భక్తి శ్రద్దలతో ఉపవాసం చేస్తూ స్వామివారిని దర్శించుకున్న ప్రజలందరి కోరికలు నేరవేరాలని అన్నారు. ప్రజలు సుఖ సంతోషాలతో శివరాత్రి పండగను కూడా ఘనంగా జరుపుకోవాలని...అలా వారికి ఆ పరమశివుడే అనుగ్రహించాలని కోరుకున్నానని హరీష్ వెల్లడించారు.