పెళ్లికి ముందు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కాలం కలిసిరాక ఆమెకు మరొకరితో వివాహమైంది. అయినా ఆమెను మాజీ ప్రియుడు వదలలేదు. భర్త ఇంట్లో లేని సమయంలో ఆమె వద్దకు వెళ్లి లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించాడు. ఆమె అందుకు అంగీకరించకపోవడంతో... కోపంతో కత్తితో పొడిచి పరారయ్యాడు. ఈ సంఘటన బంజారాహిల్స్  పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే... బసవతారకం నగర్‌ బస్తీకి చెందిన షేక్‌ జబ్బర్‌ కారు డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. అతడి భార్య నసీంభాను గృహిణి. వీరికి ఒక కుమారుడు కాగా, ప్రస్తుతం ఆమె అయిదు నెలల గర్భవతి. కాగా.. నసీంభాను పెళ్లికి ముందు ఆసిఫ్ అనే వ్యక్తిని ప్రేమించింది. పెళ్లి తర్వాత కూడా కొంతకాలం అతనితో వివాహేతర సంబంధం నడిపింది. తర్వాత తన తప్పును తెలుసుకొని ప్రియుడిని దూరం పెట్టడం ప్రారంభించింది.

ఆమె అభ్యర్థను వినని ఆసిఫ్.. తరచూ నసీంభాను ని వేధించడం మొదలుపెట్టాడు. ఇటీవల ఆమె భర్త ఇంట్లో లేని సమయంలో తన కోరిక తీర్చాలంటూ ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో.. కోపంతో గర్భవతి అని కూడా చూడకుండా కత్తితో దాడి చేశాడు. గమనించిన ఆమె సోదరుడు స్థానికుల సహాయంతో ఆస్పత్రికి తరలించారు. కాగా... ఆమె భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.