తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు వేలు పెడుతున్నారు.. ఈటల సంచలన వ్యాఖ్యల వెనుక అంతర్యమేంటి ?
తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అధికార, ప్రతిపక్ష పార్టీల మాటల యుద్దాలు జరుగుతున్నాయి. అదే తరుణంలో అగ్ర నేతలు సంచలన ఆరోపణలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఓటర్ల ద్రుష్టిని ఆకర్షిస్తున్నారు. తాజాగా బీజేపీ అగ్రనేత ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంతకీ ఆ నాయకుడేవరు? ఆయన చేసిన కీలక వ్యాఖ్యలేంటో తెలుసుకుందాం.
Etela Rajender: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని రాజకీయ పార్టీలన్ని ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఈ తరుణంలో పలు కీలక నేతలు పార్టీలు మారుతూ సమీకరణాలు మారుస్తున్నారు. అసలు ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో.. రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో అర్థంకాక పార్టీ శ్రేణులే కాగా.. రాజకీయ విశ్లేషకులు కూడా అయోమయంలో ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ నేతలు కూడా తెలంగాణ ఎన్నికల్లో తల దూరుస్తున్నారని కొందరు నేతలు ఆరోపిస్తున్నారు.
తాజాగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు వేలు పెడుతున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఈటెల.
బాబు జైలు నుంచి విడుదలైన తర్వాత కాంగ్రెస్‌ను పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని ఈటెల సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా..2018లో కాంగ్రెస్ పార్టీతో కలిసి తెర ముందు ప్రచారం చేసిన చంద్రబాబు 2023లో కాంగ్రెస్ గెలుపుకు తెరవెనుక ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ వ్యవహర తీరు స్పష్టంగా తెలుసుననీ, కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయాన్ని ఈటల గుర్తు చేశారు. బీఆర్ఎస్‌కు ఓటేసినా.. కాంగ్రెస్ పార్టీకి ఓటేసినా.. చివరికి కేసీఆర్‌ను సీఎం అవుతారని కీలక వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు.. ఏపీ స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబు 52 రోజుల అనంతరం మంగళవారం నాడు మధ్యంతర బెయిల్ మీద విడుదలయ్యారు. చంద్రబాబు అనారోగ్యం దృష్ట్యా 4 వారాల బెయిల్‌ను న్యాయస్థానం మంజూరు చేసింది. ఈ తరుణంలో తెలంగాణ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ ఎన్నిలకు దూరంగా ఉంది. దీంతో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ నేతల్లో కొంత మంది కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నరంటూ ఆయన ఆరోపించారు. కాసాని వ్యాఖ్యలను ద్రుష్టిలో పెట్టుకుని చంద్రబాబుపై ఈటల కీలక ఆరోపణలు చేసి ఉంటారని పలు భావిస్తున్నారు.