హైదరాబాద్: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ భూకబ్జాలకు పాల్పడ్డారనే ఆరోపణపై బిజెపి తెలంగాణ నేత విజయశాంతి స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ఆమె సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. 

లక్ష కోట్లు మింగిన దొర కుటుంబం బడుగు బలహీనవర్గాలపై చేస్తున్న అణచివేత ప్రక్రియలో తమ్ముడు ఈటెల రాజేందర్ ది మరో దుర్మార్గమని ఆమె వ్యాఖ్యానించారు తెలంగాణ ప్రజలకు దొర అహంకారపు ధోరణుల నుంచి త్వరలో విముక్తి తప్పకుడా లభించి తీరుతుందని ఆమె అన్నారు. 

తన జమున హాచరీస్ కోసం ఈటెల రాజేందర్ ఎస్సీ, ఎస్టీల అసైన్డ్ భూములను బలవంతంగా తీసుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలపై ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణకు ఆదేశించారు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలపై ఏ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు ఈటెల రాజేందర్ ప్రకటించారు. 

తనపై వచ్చిన ఆరోపణలపై ఈటెల రాజేందర్ తీవ్రంగా ప్రతిస్పందించారు. తాను తన జీవితం నిప్పులాంటిదని, తాను ఏ విధమైన అక్రమాలకు కూడా పాల్పడలేదని ఆయన చెప్పారు. ఎస్సీ, ఎస్టీ అసైన్డ్ భూముల విషయంలో తాను చేసిన ప్రయత్నాలను కూడా ఆయన వివరించారు.