Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll: ఆ బాధ్యత హుజురాబాద్ ప్రజలదే.. ఈటల రాజేందర్

హుజురాబాద్ ఉపఎన్నిక కోసం ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. అనంతరం, హుజురాబాద్ నియోజకవర్గంలో తనను బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీజేపీ రాష్ట్ర, కేంద్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఇరవై రోజుల్లో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలదేనని చెప్పారు.
 

etela files nomination in huzurabad bypoll
Author
Hyderabad, First Published Oct 8, 2021, 6:16 PM IST

కరీంనగర్: హుజురాబాద్ ఉపఎన్నిక కోసం నామినేషన్ల గడువు నేటితో ముగిసింది. ఇదే రోజు బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ నామినేషన్ వేశారు. రాజేందర్‌తోపాటు హుజురాబాద్ ఉపఎన్నిక ఇన్చార్జ్ జితేందర్ రెడ్డి, కేంద్ర మంత్రి కిశన్ రెడ్డిలూ వెళ్లారు. అనంతరం, ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. హుజురాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా ప్రకటించినందుకు బీజేపీ కేంద్ర, రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. హుజురాబాద్ ఎన్నిక దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా మారనుందని అన్నారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రే అధికార దుర్వినియోగానికి పాల్పడి ఈ ఎన్నికలో పార్టీని గెలిపించుకోవాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ గెలువకుంటే రాష్ట్రంలో అమలయ్యే పథకాలు ఇక్కడ రావని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలిపారు. హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదంతోనే తాను నామినేషన్ వేసినట్టు వివరించారు. ఇక రాబోయే ఇరవై రోజులు నియోజకవర్గంలో అక్రమాలు జరిగే అవకాశముందని, వాటిని అడ్డుకునే బాధ్యత నియోజకవర్గ ప్రజలదేనని అన్నారు.

ఇది ఈటల రాజేందర్ ఆత్మగౌరవం కాదని, ఇది హుజురాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి సంబంధించిన ఎన్నికలు అని జితేందర్ రెడ్డి అన్నారు. కాగా, కేంద్ర మంత్రి కిశన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ ఎన్నికలు నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న
ఎన్నిక అని తెలిపారు.

కేసీఆర్ పాలనకు చరమగీం పాడాలని, ఇందుకు హుజురాబాద్ ప్రజలే దారి వేయాలని కిశన్ రెడ్డి అన్నారు. గత ఏడున్నర ఏళ్లుగా ఎన్నికలకు ముందు హామీలివ్వడం తర్వాత వాటిని అటకెక్కించడం పరిపాటిగా మారిందని టీఆర్‌ఎస్‌పై విమర్శలు చేశారు. ఆ పార్టీ వందల కోట్లు ఖర్చుపెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని అన్నారు. ఈటల రాజేందర్‌ను హుజురాబాద్ ప్రజలు గెలిపిస్తారని తెలంగాణ ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఆయనను భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు అని విమర్శించారు.

Follow Us:
Download App:
  • android
  • ios