తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఈఎస్ఐ మెడికల్ స్కాం విచారణలో ఏసీబీ దూకుడు పెంచింది. ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

నిందితులను రెండు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించడంతో చంచల్‌గూడ జైల్లో ఉన్న ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణితో పాటు మరో ఆరుగురిని కూడా అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి వీరిని తరలించి తొలి రోజు పలు కీలక విషయాలను రాబట్టారు. మందుల కొనుగోళ్లు, ఫార్మా టెండర్లు, ఆస్తులపై ఆరా తీసుకున్న అధికారులు దేవికారాణిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

మందుల కొనుగోళ్లలో జీవో నెం. 51ని ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. అయితే దేవికారాణి, పద్మ పొంతనలేని సమాధానాలు చెప్పినట్లుగా తెలుస్తోంది.

మరోవైపు బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలపై కూపీ లాగిన ఏసీబీ సాక్ష్యాలు ముందుపెట్టి ప్రశ్నల వర్షం కురిపించింది. రెండో రోజు కస్టడీ తర్వాత నిందితులను కోర్టులో హాజరుపరచనుంది ఏసీబీ.