వరంగల్‌: తమ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తన కింద పనిచేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. "మేం కాదు.. చంద్రబాబే మా కింద పనిచేశారు" అని ఆయన ఆదివారం మీడియాతో అన్నారు. 

టీడీపీలో చంద్రబాబు కంటే ముందు నుంచే కేసీఆర్, తాను క్రియాశీలకంగా ఉన్నామని ఎర్రబెల్లి చెప్పారు. పార్టీలో చేరి చంద్రబాబు.. గ్రూపు రాజకీయాలు చేసి పార్టీని నాశనం చేశారని విమర్శించారు. తమలాంటి వాళ్లను టీడీపీలో తొక్కిపెట్టారని ఆరోపించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఓడించాలని చూసిన చంద్రబాబుకు అక్కడి ప్రజలు బుద్ధి చెబుతారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

చంద్రబాబు కాలాంతకుడు. తెలంగాణలోనే కాదు ఆంధ్రాలోనూ టీడీపీనీ నాశనం పట్టించేదాకా ఆయన నిద్రపోడని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో గ్రూపుల సంస్కృతిని పెంచి పోషించింది చంద్రబాబేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో చంద్రబాబు.. టీఆర్‌ఎస్‌కు, సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవటమే తమ కొంప ముంచిదని ఆంధాప్రాంత మంత్రులే కాదు, ప్రజలు కూడా చెబుతున్నారని అన్నారు.

కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ టీడీపీని స్థాపిస్తే అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని ఏ ఒక్కరూ సమర్థించలేదని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీలో సీఎం కేసీఆర్, తాను సీనియర్లుగా ఉన్నామని, ఆ తరువాతే చంద్రబాబు వచ్చారని, ఆయన తమ కంటే జూనియర్ ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. 

తాను తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉంటే రేవంత్‌రెడ్డితోపాటు మరికొందరిని ఎగదోసి తమలో తమకే కొట్లాట పెట్టి పార్టీ నాశనానికి కారకులయ్యారని ఆరోపించారు. తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఘోరంగా ఓడిపోతుందన్న సంకేతాలు తమకున్నాయని ఆయన అన్నారు.