ప్రణీత్ రావు ఎవరో నాకు తెలియదు: ఎర్రబెల్లి దయాకర్ రావు
ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు ఎవరో తనకు తెలియదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.మంగళవారంనాడు హైద్రాబాద్ తెలంగాణ భవన్ లో ఎర్రబెల్లి దయాకర్ రావు మీడియాతో మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన ప్రణీత్ రావు ఎవరో కూడ తనకు తెలియదని ఆయన పునరుద్ఘాటించారు.ఫోన్ ట్యాపింగ్ తో తనకు సంబంధం లేదన్నారు.తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని దయాకర్ రావు చెప్పారు.ప్రణీత్ రావుకు తమ ఊళ్లో బంధువులు ఉన్నారని ఆయన చెప్పారు.ప్రణీత్ రావు కుటుంబం ఏ పార్టీలో ఉందో విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు.
తనపై శరణ్ చౌదరి అనే వ్యక్తి తనపై సీఎంఓలో ఫిర్యాదు చేసినట్టుగా మీడియాలో చూసినట్టుగా దయాకర్ రావు స్పందించారు. శరణ్ చౌదరి అనే వ్యక్తి తనకు తెలియదన్నారు. వ్యాపారి శరణ్ చౌదరి తనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని దయాకర్ రావు చెప్పారు. శరణ్ చౌదరిపైనే భూదందాలకు సంబంధించిన ఆరోపణలున్నాయని దయాకర్ రావు చెప్పారు. శరణ్ పై పలు కేసులున్నాయని దయాకర్ రావు ఆరోపించారు.తనపై ఉద్దేశ్యపూర్వకంగానే శరణ్ చౌదరి ఆరోపణలు చేస్తున్నారని దయాకర్ రావు చెప్పారు.
తన వద్దకు ఎవరైనా ఇలాంటి పంచాయితీల విషయమై వస్తే న్యాయం ఎటుంటే అటువైపే వ్యవహరించాలని తాను అధికారులకు సూచించేవాడినని దయాకర్ రావు చెప్పారు. తాను ఏనాడూ ఇలాంటి వ్యవహరాల్లో తలదూర్చలేదని ఆయన ప్రకటించారు. తన రాజకీయ జీవితంలో ఎనాడూ కబ్జాలకు పాల్పడలేదని దయాకర్ రావు చెప్పారు.తన వద్దకు వచ్చిన విజయ్ తన బంధువు కాదని దయాకర్ రావు తెలిపారు. ఈ విషయమై తాను విజయ్ ను సీపీ వద్దకు వెళ్లాలని సూచించినట్టుగా దయాకర్ రావు గుర్తు చేసుకున్నారు.