పాలకుర్తి: అనుహ్యంగా పాలకుర్తి అసెంబ్లీ నుండి టికెట్టు దక్కించుకొని వరుసగా రెండు దఫాలు విజయం సాధించిన ఎర్రబెల్లి దయాకర్ రావు.. మూడోసారి ఇదే నియోజకవర్గం నుండి తన అదృష్టాన్ని పరీక్షించుకొనే ప్రయత్నం చేస్తున్నారు.తెలంగాణ ఉద్యమానికి కంచుకోటగా నిలిచిన వరంగల్ జిల్లాలోని పాలకుర్తి నుండి టీడీపీ అభ్యర్థిగా ఎర్రబెల్లి దయాకర్ రావు గత ఎన్నికల్లో విజయం సాధించారు.ప్రస్తుతం టీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన బరిలో నిలిచారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 ఎన్నికలకు ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఈ నియోజకవర్గాల పునర్విభజనలో  గతంలో దయాకర్ రావు ప్రాతినిథ్యం వహించిన వర్ధన్నపేట ఎస్సీలకు రిజర్వ్ అయింది. చెన్నూరు నియోజకవర్గం కనుమరుగై పాలకుర్తి కొత్త నియోజకవర్గంగా ఏర్పడింది. చెన్నూరు నుండి గతంలో దయాకర్ రావు మామ మాజీ మంత్రి యతిరాజరావు పలు దఫాలు ప్రాతినిథ్యం వహించారు.

2009 ఎన్నికల సమయంలో దయాకర్ రావు పోటీ చేయడానికి పాలకుర్తి మినహ మరో నియోజకవర్గం లేదు. ఆ సమయంలో టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలు మహాకూటమిగా ఏర్పడ్డాయి.  ఈ తరుణంలో పాలకుర్తి నుండి సుధాకర్ రావు కూడ టీడీపీ టికెట్టు ఆశించారు.  అయితే ఈ స్థానం నుండి ఇద్దరిలో ఎవరూ పోటీ చేస్తారో తేల్చుకోవాలని ఆ సమయంలో చంద్రబాబునాయుడు సుధాకర్ రావు , ఎర్రబెల్లి దయాకర్ రావులకు సూచించారు.

ఈ ఎన్నికల్లో సుధాకర్ రావును ఒప్పించి ఎర్రబెల్లి దయాకర్ రావు పాలకుర్తి నుండి పోటీ చేశారు. తొలి సారిగా పాలకుర్తి నుండి దయాకర్ రావు టీడీపీ అభ్యర్ధిగా 2009లో పోటీ  చేసి విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సుధాకర్ రావు టీఆర్ఎస్ లో చేరారు. 

2014 ఎన్నికల సమయంలో పాలకుర్తి నుండి కాకుండా గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని ఏదైనా సీటు నుండి పోటీ చేయాలని దయాకర్ రావు భావించారు. కానీ, ఆ సమయంలో బీజేపీ, టీడీపీ పొత్తు కారణంగా  గ్రేటర్ లో పోటీ చేయడానికి దయాకర్ రావుకు సాధ్యం కాలేదు. కానీ, పాలకుర్తి నుండే పోటీ చేయాలని దయాకర్ రావు చంద్రబాబునాయుడు సూచించారు.

2014 ఎన్నికల సమయంలో దయాకర్ రావు టీడీపీ అభ్యర్ధిగా రెండో సారి పోటీ చేసి విజయం సాధించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరారు. మరోసారి పాలకుర్తి నుండి దయాకర్ రావు పోటీ చేస్తున్నారు. 

ఈ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్ధిగా ఎర్రబెల్లి దయాకర్ రావు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా జంగా రాఘవరెడ్డి మధ్యే ప్రధాన పోటీ ఉంది. డీసీసీబీ ఛైర్మెన్ గా పనిచేసిన జంగా రాఘవరెడ్డి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండేళ్లుగా పాలకుర్తి నుండి పోటీ చేసేందుకు వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.

ఈ నియోజకవర్గంలో మొత్తం 2,22,944 ఓటర్లున్నారు. వీరిలో అత్యధికంగా రాయపర్తిలో 58వేల మంది ఉండగా,తొర్రూరులో 40 వేల మంది ఓటర్లు ఉన్నారు. ప్రతీ ఎన్నికల్లో రాయపర్తి, తొర్రూరు ఓటర్ల తీర్పే అభ్యర్థి విజయంలో కీలకపాత్ర పోషిస్తోంది. 

నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని దయాకర్ రావు భావిస్తున్నారు. టీఆర్ఎస్ లో చేరిన తర్వాత  నియోజకవర్గంలో చేపట్టిన పలు కార్యక్రమాలను దయాకర్ రావు వివరిస్తున్నారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో జంగా రాఘవరెడ్డి ప్రజలకు వివరిస్తున్నారు. అయితే పాలకుర్తి నుండి టీఆర్ఎస్ టికెట్టు ఆశించిన కొందరు నేతలు బహిరంగంగానే దయాకర్ రావుపై విమర్శలు గుప్పించారు.