Errabelli Dayakar: ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం లేదు: ఎర్రబెల్లి
మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఆ కేసుతో తనను కలిపి వస్తున్న ఆరోపణలను ఖండించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజు సంచలనాలను రేపుతున్నది. ఈ కేసులో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాత్ర ఉన్నదంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. తనకు ఫోన్ ట్యాపింగ్ కేసుతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారితో ఎర్రబెల్లి దయాకర్ రావు కలిసి ఓ వ్యాపారిని అక్రమంగా అదుపులోకి తీసుకుని రూ. 50 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు.
‘ఈ వ్యవహారంలోకి నన్ను ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదు. ఫోన్ ట్యాపింగ్ కేసుతో నాకు సంబంధం లేదు’ అని ఎర్రబెల్లి అన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రలో భాగమేనని వివరించారు. అసలు చరణ్ చౌదరి ఎవరో కూడా తనకు తెలియదని దయాకర్ రావు మీడియాకు వెల్లడించారు.
చరణ్ చౌదరి భూ కబ్జా చేశాడనే ఆరోపణలతో బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారని ఎర్రబెల్లి అన్నారు. అంతేకాదు, ఆయన ఎన్ఆర్ఐలను చీట్ చేసి డబ్బులు వసూలు చేశాడని ఆరోపించారు. అజయ్ అనే వ్యక్తిని కూడా చరణ్ చౌదరి చీట్ చేశాడని, మోసోయిన ఎన్ఆర్ఐలు మాత్రమే తనకు తెలుసు అని ఎర్రబెల్లి తెలిపారు.
నకిలీ డాక్యుమెంట్లతో భూకబ్జాలు చేశారనే ఆరోపణలతో చరణ్ పై కేసులు ఉన్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. తాను 40 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నామని, కానీ, ఎప్పుడూ ఆరోపణలు ఎదుర్కోలేదని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన ప్రణీత్ రావుతో తనకు సంబంధాలు లేవని స్పష్టం చేశారు.
పార్టీ మారాలని తన మిత్రులకు ఒత్తిళ్లు వస్తున్నాయని పేర్కొన్న ఎర్రబెల్లి దయాకర్ రావు.. కానీ, తాను మాత్రం ఎంతటి ప్రెజర్ వచ్చినా పార్టీ మారబోనని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమయంలోనూ కేసులు పెట్టి పార్టీ మార్చాలని ప్రయత్నించారని విఫలం అయ్యారని వివరించారు.