ప్రధాని మోడీ ఈ రోజు తెలంగాణలో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రిపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇతర రాష్ట్రాలతో సమానంగా తెలంగాణను చూడాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్భంలో ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ అనే నినాదంతో భారీ ఫ్లెక్సీని హైదరాబాద్‌లో ప్రదర్శించారు.
హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ రోజు తెలంగాణలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ముచ్చింతల్‌లోని 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అంతకు ముందే చినజీయర్ స్వామి ఆశ్రమం వెళ్లారు. ప్రధాని మోడీకి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అయితే, ప్రధాని మోడీని ఆహ్వానించడానికి సీఎం కేసీఆర్ వెళ్లకపోవడం చర్చనీయాంశమైంది. ఆయనతో వేదిక కూడా పంచుకోలేదు. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతుండగా.. మరో ఊహించిన పరిణామం వారికి ఎదురైంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతున్నదని, ఇది సరికాదని, ఇతర రాష్ట్రాలతో సమానంగా తమ రాష్ట్రాన్ని చూడాలని రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో యువత భారీ ఫ్లెక్సీతో ప్రదర్శన ఇచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను తెలంగాణకు ఎందుకు విడుదల చేయడం లేదని వారు ప్రశ్నించారు. ‘ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ఈ డిమాండ్ మారుమోగిపోతున్నది. కొంతసేపు ఈ హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్ టాప్ ట్రెండింగ్‌కు చేరింది.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందని, కానీ, అందులో తెలంగాణ కనిపించలేదని, ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణకు కేంద్రం నుంచి అందాల్సిన వాటా అందనేలేదని చాలా మంది ట్విట్టర్ యూజర్లు ట్వీట్లతో పోటెత్తారు. తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ట్వీట్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం పలు రాష్ట్రాలకు 84 నవోదయ విద్యాలయాలను మంజూరు చేసిందని, కానీ, తెలంగాణకు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని పేర్కొన్నారు. ఇదెక్కడి న్యాయం అంటూ ఓ పేపర్ కటింగ్ పోస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి తమ ఎంపీలు ఎన్నో లేఖలు, మరెన్నో విజ్ఞప్తులు చేశారని, వాటిపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకున్నదోనైనా కనీసం వివరించాని ఐటీ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను ఇవ్వకుండా తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల గురించి పట్టించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు.
కేంద్రం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటున్నదని, కానీ, దేశ ఆర్థిక వ్యవస్థ పురోభివృద్ధికి దోహదపడే టాప్ రాష్ట్రాల్లో నాలుగోదైన తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఎందుకు సహకరించదని ఎమ్మెల్యే ఎన్ దివాకర్ రావు అడిగారు. మెడికల్ కాలేజీ కేటాయింపు, ట్రైబల్ యూనివర్సిటీ, వరద విపత్తులు, నీటి పారుదల ప్రాజెక్టులకు జాతీయ హోదా, పట్టణాభివృద్ధి నిధులు అందించడంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత రావు ట్వీట్ చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంలో కేంద్రం విఫలమైందని, తెలంగాణకు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయడంలోనూ మొండి చేయి చూపిందని దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పేర్కొన్నారు. నిధులు, ప్రాజెక్టులు కర్ణాటక, గుజరాత్‌లకు ఇచ్చినప్పుడు తాము పలుమార్లు విజ్ఞప్తులు చేసినా తెలంగాణకు ఎందుకు ఇవ్వరు అని నకిరేకల్ ఎమ్మెల్యే ప్రశ్నించారు. ప్రధాని మోడీపై మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ తరహాలోనే ప్రశ్నలు వేశారు. హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో కేసీఆర్ విలేకరుల సమావేశంలో మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయించిందేమీ లేదని, గుండు సున్నా అని మండిపడ్డారు. బడ్జెట్ అంతా గోల్ మాల్ గోవిందం అంటూ సీరియస్ అయ్యారు.
