ఎంబీఎస్, ముసద్దీలాల్ జ్యువెలర్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాల సాకారంతో సోదాలను కొనసాగిస్తున్నారు.
ఎంబీఎస్, ముసద్దీలాల్ జ్యువెలర్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండో రోజు దాడులు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్, ఫెమా ఉల్లంఘనల ఆరోపణల నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముసద్దీలాల్ జ్యువెలరీ, ఎంబీఎస్ జ్యువెలరీ షోరూమ్‌లలో ఈడీ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని 20 చోట్ల ఈ సోదాలు జరిగాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు ఈ సోదాల్లో పాల్గొన్నాయి. ఈరోజు కూడా ఎంబీఎస్, ముసద్దీలాల్ జ్యువెలర్స్ షోరూమ్‌లలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కేంద్ర బలగాల సాకారంతో సోదాలను కొనసాగిస్తున్నారు.
ఎంబీఎస్ గ్రూప్, సంస్థ డైరెక్టర్ సుకేష్ గుప్తా, అనుబంధ కంపెనీలు.. అదనంగా ఐదు శాతం పన్ను చెల్లించకుండా ఫారెక్స్ స్థానాలను నిర్వహించడానికి ఎంఎంటీసీ నుంచి క్రెడిట్‌పై బంగారాన్ని పొందాయని.. తద్వారా కార్పొరేషన్‌కు నష్టం వాటిల్లిందని ఈడీ తెలిపింది. 2014లో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే రూ. 504 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. గతేడాది రూ. 363 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.
మళ్లీ అదే తరహా నేరానికి పాల్పడుతున్నట్టుగా ఎంబీఎస్ జ్యువెలరీపై ఈడీకి పలు ఫిర్యాదులు అందడంతో.. మరోసారి సోదాలు ప్రారంభించింది. ఎంబీస్ బంగారం కొనుగోలుకు వ్యతిరేకంగా నకిలీ ఇన్‌వాయిస్‌లు జారీ చేసి డబ్బును ఇతర ప్లాట్‌ఫారమ్‌లకు మళ్లించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఎంబీఎస్ నుంచి హార్డ్ డిస్క్‌లు, ఖాతా పుస్తకాలను ఈడీ స్వాధీనం చేసుకుంది.
అదేవిధంగా నోట్ల రద్దు సమయంలో భారీగా నిధులు మళ్లించినందుకు హైదరాబాద్‌లోని ముసద్దిలాల్ జ్యువెలర్స్‌పై ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. 500, 1000 డినామినేషన్ల 111 కోట్ల పాత నోట్లను నకిలీ విక్రయ రికార్డులు చూపించి మార్చుకున్నందుకు ముసద్దిలాల్ జ్యువెలర్స్‌పై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి.. ముసద్దిలాల్‌కు చెందిన ఎర్రమంజిల్, సికింద్రాబాద్ ఔట్‌లెట్లతో పాటు కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించింది. పలు దస్తావేజులు, ఖాతా పుస్తకాలు, బంగారం కొనుగోలు ఇన్‌వాయిస్‌లు, బ్యాంకు హామీ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రాత్రి 9 గంటల వరకు సోదాలు జరిగాయి. సెంట్రల్ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేశారు.
