Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ లిక్కర్ స్కామ్.. ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు..

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ అంశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ  కొనసాగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది.

Enforcement Directorate notice to auditor Buchi Babu in delhi liquor scam
Author
First Published Mar 13, 2023, 3:04 PM IST

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన మనీ లాండరింగ్ అంశంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ  కొనసాగిస్తుంది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన ఆడిటర్ బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 15 విచారణకు హాజరుకావాల్సిందిగా నోటీసుల్లో ఈడీ ఆదేశించింది. అయితే బుచ్చిబాబు నుంచి ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం రాబట్టేందుకే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వద్ద ఆడిటర్‌గా పనిచేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. బుచ్చిబాబును ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కొద్ది రోజుల క్రితం కూడా దర్యాప్తు సంస్థలు విచారించిన సంగతి తెలిసిందే. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు కీలక పాత్ర పోషించారని సీబీఐ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి బుచ్చిబాబును సీబీఐ అరెస్ట్ కూడా చేసింది. ఆ సమయంలో సీబీఐ, ఈడీ అధికారులు వేర్వురుగా బుచ్చిబాబును విచారించారు. అయితే గత సోమవారం బుచ్చిబాబుకు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే తాజాగా బుచ్చిబాబుకు ఈడీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 16న ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ఎదుర్కొవాల్సి ఉన్నందున.. అందుకు ఒక్క రోజు ముందు బుచ్చిబాబును విచారణకు పిలవడం చర్చనీయాంశంగా మారింది. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవిత ప్రమేయాన్ని ఆడిటర్ బుచ్చిబాబు ధృవీకరించారని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. అరబిందో ఫార్మాకు చెందిన శరత్ చంద్రారెడ్డి, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి హవాలా ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి (ఆప్) రూ. 100 కోట్లు చెల్లించేందుకు కవిత ఏర్పాట్లు చేశారని ఈడీ ఆరోపించింది.

ఫిబ్రవరి 23న నమోదైన బుచ్చిబాబు వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ.. కవిత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాల మధ్య రాజకీయ అవగాహన ఉందని ఈడీ పేర్కొంది. కవిత 2021 మార్చి 19, 20 తేదీల్లో ఢిల్లీలోని గౌరీ అపార్ట్‌మెంట్స్‌లో కేజ్రీవాల్, సిసోడియా ప్రతినిధి విజయ్ నాయర్‌ని కలిశారని తెలిపింది. ఈ సందర్బంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో తాము ఏమి చేయగలమో కవితకు విజయ్ నాయర్ వివరించే ప్రయత్నం చేరని.. మద్యం పాలసీలో, మద్యం వ్యాపారంలో కవితకు చేసే సహాయానికి బదులుగా ఆప్‌కు కొంత నిధులు ఇవ్వాలని ప్రతిపాదించారని పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios