ఖమ్మం ఎంపీ, టీఆర్ఎస్  నేత నామా నాగేశ్వరరావుకు  చెందిన మధుకాన్ సంస్థ ఆస్తులను ఈడీ  జప్తు  చేసింది. రూ.80.65 కోట్ల విలువైన  ఆస్తులను ఈడీ  జప్తు  చేసింది.

హైదరాబాద్: టీఆర్ఎస్ కు చెందిన ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కు చెందిన కంపెనీలకు చెందిన రూ.80.65 కోట్లను జప్తు చేసినట్టుగా ఈడీ ప్రకటించింది.మధుకాన్ సంస్థకు నామా నాగేశ్వరరావు ప్రమోటర్ గా ఉన్నారు.

మధుకాన్ సంస్థకు చెందిన స్థిర,చర ఆస్తులను జప్తు చేసినట్టుగా ఈడీ ప్రకటించింది. ఈ ఏడాది జూలై 2న కూడా మధుకాన్ గ్రూప్ సంస్థలకు చెందిన రూ.96కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసిన విషయం తెలిసిందే.ఈ కేసుకు సంబంధించి నామా నాగేశ్వరరావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు మధుకాన్ సంస్థలకు చెందిన కార్యాలయాలు ఈ సంస్థతో సంబంధం ఉన్న నామా నాగేశ్వరరావు కుటుంబసభ్యుల ఇళ్లలో గత ఏడాది జూన్ మాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.

2021 జూన్ 25న రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే నిధుల మళ్లింపు కేసులో ఈడీ అధికారుల విచారణకు మధుకాన్ సంస్థల డైరెక్టర్లు హాజరయ్యారు.అయితే ఈ సమావేశానికి నామా నాగేశ్వరరావు హాజరు కాలేదు.రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే నిర్మాణం కోసం మధుకాన్ కంపెనీ బ్యాంకుల నుండి సుమారు రూ. 1064 కోట్లను రుణం తీసుకొంది. ఇందులో సుమారు రూ. 264 కోట్లు దారి మళ్లాయని సీబీఐ గుర్తించింది.ఈ మేరకు 2019లో సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మధుకాన్ కంపెనీతో కార్యాలయాలతో పాటు రాంచీ ఎక్స్‌ప్రెస్ హైవే సీఎండీ కార్యాలయం, డైరెక్టర్ల నివాసాల్లో 2011 జూన్ 11వ తేదీన ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు.