రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన ఉపఎన్నికల్లో మూడు ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోనివే. ఈ మూడు ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఇంచార్జీ మంత్రి జగదీశ్ రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఈ మూడు స్థానాల్లోనూ టీఆర్ఎస్ విజయాన్ని సాధించింది. టీఆర్ఎస్‌కు ఈ మూడు స్థానాల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందించడమే కాదు.. మొత్తం నల్గొండను గులాబీమయం చేశారు. 

హైదరాబాద్: సంక్లిష్ట సమయాల్లో.. పార్టీ శ్రేణుల్లో జోష్ ఆవిరవుతున్న సందర్భాల్లో వచ్చిన ఉపఎన్నికల్లో మంత్రి జగదీశ్ రెడ్డి ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. ఆత్మవిశ్వాసం సడలనివ్వలేదు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ టీఆర్ఎస్‌కు హ్యాట్రిక్ విజయాలను అందించడంలో ప్రధాన పాత్ర పోషించారు. తన నల్గొండ జిల్లా పరిధిలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన ఉపఎన్నికల్లో ఆయన అద్భుతంగా రాణించి పార్టీని విజయతీరాలకు తీసుకెళ్లగలిగారు. పార్టీకి విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు.

తాజాగా జరిగిన మునుగోడు, 2021 ఏప్రిల్‌లో నాగార్జున సాగర్, 2019 అక్టోబర్‌లో హుజూర్‌నగర్‌‌లో పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో మంత్రి జగదీశ్ రెడ్డిది ప్రధాన పాత్ర. ఈ మూడు అసెంబ్లీ స్థానాలకు వచ్చిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ను విజయం వైపు నడిపించారు. తద్వార నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉండేట్టు చేయడంలో సఫలమయ్యారు.

Also Read: మునుగోడులో టీఆర్ఎస్ విజయానికి కారణాలు.. టాప్ పాయింట్స్

పైన పేర్కొన్న మూడు ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సీనియర్ లేదా బలమైన ప్రత్యర్థులతోనే ఢీకొట్టింది. ఆ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఓడించింది. అదీ దుబ్బాక, హుజురాబాద్ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో పరాజయం పాలై.. మళ్లీ శక్తిని నిరూపించుకోవాల్సిన సందర్భాల్లో జరిగిన బైపోల్స్ ఇవి.

ఉత్తమ్ కుమార్ లోక్‌సభకు ఎన్నికై రాజీనామా చేయడంతో హుజూర్‌నగర్‌లో 2019 మే నెలలో ఉపఎన్నిక జరిగింది. ఇక్కడ ఉత్తమ్ కుమార్ భార్య పద్మావతి పై టీఆర్ఎస్ క్యాండిడేట్ సైది రెడ్డి గెలిచారు. ఆ తర్వాత నాగార్జున్ సాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ సీనియర్ లీడర్, ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన 75 ఏళ్ల జానారెడ్డిని 37 ఏళ్ల టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఓడించారు. మునుగోడులో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ని టీఆర్ఎస్ ఓడించింది. ఈ ఉప ఎన్నికలు జరిగిన మూడు స్థానాలూ నల్గొండ పరిధి లోనివే కావడంతో ఈ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

Also Read: మునుగోడులో బీజేపీ ఓటమికి కారణాలివే.. వ్యూహాత్మక తప్పిదాలు.. చౌటుప్పల్, చండూర్‌లో అంచనాలు తలకిందులు!

ఈ విజయపరంపర పై జగదీశ్ రెడ్డి డెక్కన్ క్రానికల్‌తో మాట్లాడుతూ, ‘ఇప్పుడు మొత్తం నల్గొండ జిల్లాకు టీఆర్ఎస్ ప్రాతినిధ్యం వహిస్తున్నది. ఈ జిల్లాలో జరిగిన మూడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లోనూ టీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్, కేటీఆర్ అందించిన బలమైన నాయకత్వంతోనే ఇది సాధ్యమైంది’ అని అన్నారు.