బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు , ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం: కాంగ్రెస్ ఎన్నికల హామీలు
Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే ఆరు ప్రధాన హామీలు ప్రకటించింది. తాజాగా తెలంగాణలో అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మరిన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
Telangana Congress: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు 2023 నేపథ్యంలో కాంగ్రెస్ ఇప్పటికే ఆరు ప్రధాన హామీలు ప్రకటించింది. తాజాగా తెలంగాణలో అధికారంలోకి వస్తే 18 ఏళ్లు నిండిన బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు రూ.12 లక్షల ఆర్థిక సాయం అందజేస్తామని మరిన్ని హామీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తూ ములుగులో బుధవారం జరిగిన బహిరంగ సభలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ ప్రకటన చేశారు. గత నెలలో పార్టీ వెల్లడించిన ఆరు హామీలకు అదనంగా ఈ సభలో పలు హామీలను ఆమె ప్రకటించారు.
అంబేద్కర్ అభయహస్తం పథకం కింద ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.12 లక్షల సాయం అందజేస్తామని చెప్పారు. అయితే, ఇది బీఆర్ఎస్ సర్కారు అమలు చేస్తున్న దళిత బంధు పథకం తరహాలో కనిపిస్తోంది. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల గ్రాంట్ అందజేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే, ఎస్సీలకు 18 శాతానికి, ఎస్టీలకు 12 శాతానికి రిజర్వేషన్లు పెంచుతామని కూడా ప్రియాంక గాంధీ ప్రకటించారు. ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద భూమిలేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు భూమితోపాటు ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.6 లక్షలు అందజేస్తామని చెప్పారు. ప్రతి ఆదివాసీ గ్రామ పంచాయతీకి రూ.25 లక్షల సాయం అందిస్తామని తెలిపారు.
ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామనీ, నిరుద్యోగులకు నెలకు రూ.4,000 భృతి చెల్లిస్తామని కూడా ప్రియాంక పేర్కొన్నారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. గల్ఫ్ దేశాల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక గల్ఫ్ సెల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన కలలను సాకారం చేసేందుకు, తమ పిల్లలకు మంచి భవిష్యత్తును అందించడానికి ప్రజలు విజ్ఞతతో ఓటు వేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. బంగారు తెలంగాణ అంటూ బీఆర్‌ఎస్ పార్టీ చేసిన వాగ్దానాన్ని ఆమె గుర్తు చేస్తూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో పార్టీ విఫలమైందన్నారు.
"సామాజిక న్యాయం ఎక్కడ ఉంది? 18 మంది మంత్రుల్లో ముగ్గురు ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వారున్నారు. వారికి 13 మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. జనాభాలో వెనుకబడిన తరగతులు 50 శాతానికి పైగా ఉండగా, బీసీలకు చెందిన ముగ్గురు మంత్రులు మాత్రమే ఉన్నారని" అన్నారు. వివిధ వర్గాల సంఖ్యకు అనుగుణంగా సమాన ప్రాతినిథ్యం లేదన్నారు. తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేసిందనీ, ఆ పార్టీ ఇప్పటికే ప్రకటించిన హామీలను ఆమె ప్రస్తావించారు. అభివృద్ధి, ఉద్యోగాలు, సామాజిక న్యాయమే తెలంగాణ కల అని ఆమె పేర్కొన్నారు. రాజకీయంగా పార్టీకి నష్టం వాటిల్లుతుందని తెలిసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న తన తల్లి సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని ప్రియాంక గాంధీ అన్నారు.