తెలంగాణలో మరో మూడు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాము గెలిచేందుకు.. తమ ప్రత్యర్థులను ఓడించేందుకు నేతలు ఏమైనా చేస్తారు. కొందరు ప్రజలను డబ్బు, మద్యం వంటి వాటితో ప్రలోభ పెట్టి... తమవైపు తిప్పుకుంటే.. మరికొందరు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తూ.. ఆకట్టుకుంటారు. అయితే.. కొందరు తెలంగాణ నేతలు తమ ప్రత్యర్థులను ఓడించేందుకు క్షుద్రపూజలు చేస్తున్నట్లు సమాచారం.

మీరు చదివింది నిజమే..  క్షుద్రపూజలు చేసేందుకు గడ్లగూబల కోసం ప్రయత్నిస్తున్నారు. కర్ణాటకలోని సేడం పట్టణంలో ఇటీవల కొందరు వేటగాళ్లు రెండు గుడ్లగూబలను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డారు. విచారణలో వారు వెల్లడించిన విషయాలను విని.. అక్కడి పోలీసులు అవాక్కయ్యారు. తెలంగాణ ఎన్నికల్లో పోటీచేస్తున్న ఓ అభ్యర్థి ఈ గుడ్లగూబలు కావాలని తమను పురమాయించారని నిందితులు చెప్పారు. 

ప్రత్యర్థులకు కీడు జరిగేలా క్షుద్రపూజలు నిర్వహించి వీటిని బలిస్తారని పేర్కొన్నారు. పెద్ద పెద్ద కళ్లతో ఉండే గుడ్లగూబల గురించి ప్రజల్లో ఇలాంటి అంధ విశ్వాసాలు చాలానే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అదృష్టం కోసమూ వీటిని బలిస్తుంటారు. ఇలాంటి మూఢనమ్మకాల కారణంగా దేశవ్యాప్తంగా ఏటా 80 వేల గుడ్లగూబలు బలవుతున్నట్లు అంచనాలున్నాయి.