హైదరాబాద్:ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ఆయా రాజకీయపార్టీలు, అభ్యర్థులు ప్రయత్నాలను ప్రారంభించారు. ఇప్పటివరకు  రాష్ట్ర వ్యాప్తంగా సుమారు  రూ. 140 కోట్ల నగదును సీజ్ చేసుకొన్నారు.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుండి  ఆదాయ పన్ను శాఖాధికారులు,  పోలీసులు నిర్వహించిన సోదాల్లో    పెద్ద ఎత్తున  నగదును స్వాధీనం చేసుకొన్నారు.బుధవారం రాత్రి కూడ  పోలీసులు పెద్ద ఎత్తున  నగదును  స్వాధీనం చేసుకొన్నారు. 

హైద్రాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు చోట్ల నగదును  స్వాధీనం  చేసుకొన్నామని చెప్పారు. సికింద్రాబాద్‌ చిలకలగూడలో సుమారు రూ. 3 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. కూకట్‌పల్లిలో  నోట్ల కట్టలతో  పారిపోతున్న వారిని ఓ పార్టీకి చెందిన వారు పట్టుకొని  పోలీసులకు అప్పగించారు.

వరంగల్‌ జిల్లాలోని కాజీపేటలోని ఫాతిమానగర్‌లోని ఓ ఇంట్లో  నిల్వ ఉంచిన రూ. 2 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు. ఓ రాజకీయపార్టీకి చెందిన  అభ్యర్థి  కోసం ఈ నగదును ఉంచారని  పోలీసులు అనుమానిస్తున్నారు.

వరంగల్ జిల్లా పెంబర్తిలో కారులో తరలిస్తున్న భారీగా నగదును స్వాధీనం చేసుకొన్నారు.ఈ కారులో రూ. 6 కోట్ల నగదును  స్వాధీనం చేసుకొన్నట్టు పోలీసులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ నియోజకవర్గంలోని ఓ వ్యాపారి ఇంట్లో  కూడ భారీగా నగదును  పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.