జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎన్నికల కమీషన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్ధుల గెజిట్ రిలీజైంది. డిసెంబర్ 1న గ్రేటర్ ఎన్నికలు జరగ్గా.. డిసెంబర్ 4న ఫలితాలు వెలువడ్డాయి.

అయితే ప్రస్తుత పాలక మండలి గడువు ఫిబ్రవరి 10 వరకు వుంది. ఇది ముగిసిన తర్వాతే కొత్త పాలక మండలి కొలువుదీరనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం కొత్త కార్పోరేటర్ల పేరుతో గెజిట్ ప్రకటించింది.

గెజిట్ విడుదల కావడంతో నెల రోజుల్లోపు గెలిచిన సభ్యులు ప్రమాణ స్వీకారం చేయాల్సి వుంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ సమావేశంలో కొత్త కార్పోరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

అదే సమావేశంలో మేయర్, డిప్యూటీ మేయర్‌ల ఎన్నిక జరుగుతుంది. కాగా గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో విజయం సాధించాయి. దాంతో మేయర్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది.

టీఆర్ఎస్- ఎంఐఎం కలిసి మేయర్ పీఠం దక్కించుకుంటాయా...? లేక తమ బలంతోనే అధికార పార్టీ బల్దియా పీఠంపై కూర్చొంటుందా అనేది మరికొద్దిరోజుల్లో తేలనుంది.