డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సీఎస్, అసెంబ్లీ కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది.
తనను ఎమ్మెల్యేగా గుర్తించాలంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ చేసిన విజ్ఞప్తిపై ఎన్నికల సంఘం స్పందించింది. అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి, సీఎస్, అసెంబ్లీ కార్యదర్శిని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు సోమవారం లేఖ రాసింది.
కాగా.. హైకోర్ట్ తీర్పు అనంతరం శాసనసభ స్పీకర్, కార్యదర్శిని కలిసి న్యాయస్థానం తీర్పు కాపీని అందజేసేందుకు డీకే అరుణ బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి అసెంబ్లీకి వెళ్లారు. అయితే వారిద్దరూ అందుబాటులో లేకపోవడంతో అసెంబ్లీ కార్యాలయంలో తీర్పు కాపీని అందించారు. దీనిపై డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ చేసి ముందస్తు సమాచారం అందించినా స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి అందుబాటులో లేరని ఆమె ఫైర్ అయ్యారు.
Also Read: గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డికి షాక్: అనర్హత వేటేసిన తెలంగాణ హైకోర్టు
ఇదిలావుండగా.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించింది. 2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని బండ కృష్ణ మోహన్ రెడ్డిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన తెలంగాణ హైకోర్టు గురువారం నాడు కీలక తీర్పును వెల్లడించింది. గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి రూ. 3 లక్షల జరిమానా విధించింది. ఈ జరిమానాలో రూ. 50 వేలను డీకే అరుణకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
