హైదరాబాద్: నగరంలోని పలు ప్రైవేట్ విద్యా సంస్థల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో బుధవారం నాడు  విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కొన్ని డాక్యుమెంట్లను అధికారులు తీసుకెళ్లారు.

ఈ స్కూల్ లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.ఈ ఫిర్యాదు మేరకు  జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్ లో విద్యార్థుల తల్లిదండ్రులను విచారించారు.

డీఈఓ, ఆర్జేడీని స్కూల్ లోకి రాకుండా యాజమాన్యం అడ్డుకొంది. స్కూల్ లో  గంటపాటు విచారణ నిర్వహించారు. ట్యూషన్ ఫీజును మాత్రమే వసూలు చేయాలని విద్యాశాఖాధికారులు స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు. పీజులెంత వసూలు చేస్తున్నారని ఆరా తీశారు అధికారులు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ఫీజులు వసూలు చేయాలని విద్యాశాఖాధికారులు ఆదేశించారు.

నగరంలోని పలు ప్రైవేట్ స్కూళ్లలో విద్యాశాఖాధికారులు బుధవారం నాడు తనిఖీలు నిర్వహించినట్టుగా సమాచారం. ప్రైవేట్ స్కూళ్లలో ఆన్ లైన్ క్లాసుల నిర్వహణతో  పేరేంట్స్ ను ఫీజుల కోసం వేధిస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఈ విషయమై మీడియాలో పెద్ద ఎత్తున ప్రసారం కావడంతో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారని సమాచారం.