Asianet News TeluguAsianet News Telugu

క్యాసినో కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. ఏడుగురికి నోటీసులు.. బ్యాంకు ఖాతాల్లో భారీగా నగదు..!

క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ వ్యాపారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. 

ED Serves Notice to seven People in Casino related case
Author
First Published Jul 30, 2022, 4:03 PM IST

క్యాసినో నిర్వాహకుడు చికోటి ప్రవీణ్ వ్యాపారాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ ఇప్పటివరకు ఏడుగురికి నోటీసులు జారీ చేసింది. సోమవారం ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈడీ నోటీసులు జారీ చేసినవారిలో.. చికోటి ప్రవీణ్, మాధవరెడ్డి, ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారం చేస్తున్న సంపత్, సహా మరో నలుగురు హవాలా ఏజెంట్లు ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రవీణ్‌, మాధవరెడ్డి బ్యాంకు ఖాతాల్లో దాదాపు రూ.25 కోట్ల లావాదేవీలను ఈడీ  గుర్తించింది.

అలాగే పలువురు రాజకీయ నాయకులు, అధికారులకు ప్రవీణ్, మాధవరెడ్డి ఖాతాల నుంచి నగదు బదిలీ అయినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టుగా సమాచారం. ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలను ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. మరోవైపు వీరు ఏడాదికి నాలుగు భారీ క్యాసినో ఈవెంట్లను నిర్వహించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించినట్టుగా సమాచారం.  గోవా, శ్రీలంక, నేపాల్, థాయిలాండ్‌లో ప్రవీణ్, మాధవరెడ్డి క్యాసినో ఈవెంట్లు నిర్వహించినట్టుగా అధికారులు ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది.  వాహలా మార్గంలో జరిగిన నగదు బదిలీలపై ఈడీ అధికారులు పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు. ఫెమా నిబంధనలు ఉల్లంఘనపైనా కూడా అధికారులు దృష్టి సారించారు. ప్రవీణ్, మాధవరెడ్డి లావాదేవీలకు సంబంధించిన సాంకేతిక ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది.

Also Read: క్యాసినో కింగ్ చీకోటి ప్రవీణ్ ఫామ్ హౌజ్ లో మినీ జూపార్క్..

చికోటి ప్రవీణ్.. తన క్యాసినో వ్యాపారాన్ని నిర్వహించడం కోసం రాజకీయ నాయకులు, టాలీవుడ్, బాలీవుడ్ నటులతో సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో హవాలా ద్వారా పెద్దఎత్తున లెక్కల్లో చూపని నగదును రవాణా చేయడంలో రాజకీయ నేతలకు సహాయం చేసినట్లుగా కూడా ఈడీ అధికారులు అనుమానిస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. 

ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తున్న సంపత్ అనే వ్యక్తి ప్రవీణ్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ.. అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లుగా ఈడీ గుర్తించినట్టుగా తెలుస్తోంది. నిందితుడి నాలుగు బ్యాంకు ఖాతాల వివరాలను, అతని లావాదేవీలను ఈడీ అధికారులు ధృవీకరించినట్లు తెలుస్తోంది. క్యాసినో నిర్వాహకుడు తన సన్నిహితుడు సంపత్ సహకారంతో వివిధ చోట్ల క్యాసినోలు నిర్వహించడం వల్ల రాజకీయ నాయకులు, సినీ నటులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయని ఈడీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రవీణ్ అక్రమ కార్యకలాపాలకు సంబంధించి సరైన సాక్ష్యాలను సంపాదించిన ఈడీ.. లెక్కల్లో చూపని నగదు హవాలా లావాదేవీలకు సంబంధించి.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలోని కొందరు రాజకీయ నాయకులతో పాటు కొంతమంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు అందజేసే అవకాశం ఉందని ఈడీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. 

ఇక, తెలుగు రాష్ట్రాల్లోని కొందరు ఐపీఎస్‌ అధికారులకు, వీవీఐపీలకు బహుమతులను అందించడానికి చికోటి ప్రవీణ్‌ భారీగా డబ్బు వెచ్చించినట్లు సమాచారం. ‘‘ప్రవీణ్ కాల్ డేటా ఆధారంగా.. నిందితులతో నిత్యం టచ్‌లో ఉన్న వ్యక్తుల గురించి ఈడీ సమాచారం అందింది. ఆసక్తికరంగా వారి మొబైల్ నంబర్లలో కొన్ని సమాధానం ఇవ్వలేదు. స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి’’ అని ఈడీ వర్గాలు తెలిపాయని ఓ ఆంగ్ల మీడియా సంస్థ తెలిపింది.

Follow Us:
Download App:
  • android
  • ios