హైదరాబాద్: సిబిఐ మాజీ డైరెక్టర్ విజయ రామారావు కుమారుడు శ్రీనివాస్ కార్యాలయాల్లో, ఇళ్లలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడి) అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారంనాడు ఈ దాడులు జరిగాయి. 

హైదరాబాదులోనే కాకుండా బెంగళూరులోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. కర్ణాటకకు చెందిన ఓ బ్యాంకు నుంచి ఆయన రూ.315 కోట్ల రుణం తీసుకుని చెల్లించలేదని సమాచారం. దీంతో ఆ  బ్యాంక్ అధికారులు ఈడికి ఫిర్యాదు చేశారు. 

ఈడి కేసు నమోదు చేసుకున్నారు. తమకు అందిన ఆధారాలతో ఈడి అధికారులు సోమవారంనాడు హైదరాబాదు, బెంగళూరుల్లోని శ్రీనివాస్ కార్యాలయాల్లో, ఇళ్లలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం.

సిబిఐ డైరెక్టర్ గా పనిచేసిన విజయరామారావు తొలుత తెలుగుదేశం పార్టీలో చేరారు. మంత్రి పదవిని కూడా నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు.