హైదరాబాద్: 2019 సంవత్సరానికి గాను ఆర్ధిక శాస్త్ర నోబెల్ బహుమతికి మన హైదరాబాద్ నగరానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఆర్ధిక శాస్త్రం లో నోబెల్ అందుకున్న అభిజిత్ ముఖర్జీ, అతని భార్య ఎస్తర్ డఫ్లో ఇరువురూ వారి పరిశోధనను హైదరాబాద్ లో నిర్వహించారు. ప్రపంచ పేదరికంపై వారు జరిపిన పరిశోధనలో ముఖ్య భాగం హైదరాబాద్ మహానగరంలోనే జరిపారు. హైదరాబాద్ నగరంలో చేసిన రీసెర్చ్ పై అనేక పేపర్స్ కూడా పబ్లిష్ చేసారు. 

భారత సంతతికి చెందిన అభిజిత్ బెనర్జీ, ఆయన భార్య ఎస్తర్ డఫ్లో‌లతోపాటు మైఖేల్ క్రెమర్‌లను ఈ ఏడాది నోబెల్ బహుమతికి  ఎంపిక చేసినట్టు నిన్న నోబెల్ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే. కోల్‌కతాలో జన్మించిన అభిజిత్ బెనర్జీ అంతర్జాతీయంగా పేదరికాన్ని ఎదుర్కొనే అంశంలో పరిష్కారాలు చూపినందుకు గాను ఈ పురస్కారం దక్కింది. భార్య ఎస్తర్ డఫ్లో, మైఖేల్ క్రెమర్‌తో కలిసి అభిజిత్ త్వరలో నోబెల్ పురస్కారాన్ని అందుకోనున్నారు. 

"పేదల ఆర్ధిక జీవితాలు" పేరిట పబ్లిష్ అయిన వీరి రీసెర్చ్ పేపర్ కు సంబంధించిన పరిశోధనను భారతదేశంతో సహా 13 దేశాల్లో చేసారు. మనదేశంలో హైదరాబాద్ తో పాటు ఉదయపూర్, బీహార్, ఉత్తరప్రదేశ్ లోని మరికొన్ని నగరాలను పట్టణ పేదరిక పరిశోధన కోసం ఎన్నుకున్నారు. హైదరాబాద్ లోని పేదలపై ,వారి జీవనశైలి, స్థితిగతులపై అనేక ఆసక్తికర విషయాలను వీరు వెల్లడించారు. 

హైదరాబాద్ లోని పేదలు చాలామంది కేవలం ఒక్క వృత్తిని మాత్రమే కాకుండా అనేక వృత్తులను చేపడతారని ఆ పరిశోధనలో వెల్లడించారు. ఆర్ధిక సంస్కరణల ద్వారా అత్యధిక లబ్ది పొందిన నగరాల్లో హైదరాబాద్ కూడా  ఒకటని వారు వెల్లడించారు. హైదరాబాద్ లోని పలు బస్తీల్లో(స్లమ్ముల్లో) నివసించే 2000 కుటుంబాలపై వీరు పరిశోధన జరిపి ఈ వివరాలను వెల్లడించారు. 

రోజుకు 2డాలర్లకన్నా తక్కువ సంపాదించే వ్యాపారుల్లో 21శాతం మందికి ఒకటికన్నా ఎక్కువ వ్యాపారాలున్నట్టు వీరి పరిశోధన తెలిపింది. మరో 3శాతం మందికి వ్యాపారంతోపాటు మరో కూలీ పని కూడా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ఒకటికన్నా ఎక్కువ వ్యాపారాన్ని పెదాలు నిర్వహిస్తున్నారని నిరూపించేందుకు గుంటూరుకు చెందిన దోశలమ్మే మహిళ కథనాన్ని ఉటంకిస్తూ ప్రూవ్ చేసారు.  

గుంటూరుకు చెందిన సదరు మహిళ రోజూ ఉదయం టిఫిన్ అమ్ముతుంది. దాని తరువాత మిగిలిన సమయంలో చీరల వ్యాపారం చేస్తుందని, ఇలా ఒకటికన్నా ఎక్కువ వ్యాపారాలు చేసే పేదవారు మనకు అనేక దేశాల్లో కనపడతారని వీరు తెలిపారు. ఇలా పట్టణ పేదరికానిక సంబంధించిన అనేక విషయాలను సాదోహరణంగా వివరించారు. 

సాధారణంగా ఒకటి కన్నా ఎక్కువ ఆదాయమార్గాలుంటే వారి సంపాదన అధికంగా ఉంటుందని మనము భావిస్తాము. కానీ ఇలా ఒకటికన్నా ఎక్కువ ఆదాయమార్గాలున్నవారిలో పేదలే అధికమనే విస్మయపరిచే నిజాన్ని వీరు బహిర్గతం చేసారు.