హైదరాబాద్‌: తెలంగాణ శాసనసభ ఎన్నికలలో అధికారులు న్యాయంగా, నిజాయితీగా పనిచెయ్యాలని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సూచించింది. డిసెంబర్ 7న జరగబోయే ఎన్నికల ఏర్పాట్లపై ఈసీఐ అధికారులతో సమావేశం నిర్వహించింది. ఎన్నికల ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల ఏర్పాట్లపై పరిశీలన జరిపేందుకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ ఓం ప్రకాశ్‌ రావత్‌ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్లు సునీల్‌ అరోరా, అశోక్‌ లవాస బృందం రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటించింది.  

తొలి రోజు గుర్తింపు పొందిన 9 రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా సమావేశమైన కేంద్ర ఎన్నికల బృందం వారి అభిప్రాయాలను సేకరించింది. రెండోరోజు 31 జిల్లాలకు చెందిన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. వివిధ పార్టీల నేతలు తమ దృష్టికి వచ్చిన అంశాలను సమావేశంలో చర్చించింది కేంద్రం ఎన్నికల బృందం.

సమావేశంలో ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, వికారాబాద్‌ జిల్లాలకు చెందిన జిల్లా అధికారులు తమ జిల్లాల్లో ఎక్కువ కేంద్ర బలగాలు కావాలని కోరారు. అధికారుల విజ్ఞప్తిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ ఓంప్రకాష్ రావత్ రాష్ట్రానికి కావాల్సిన అదనపు కేంద్ర బలగాలను పంపిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారులంతా న్యాయంగా, నిజాయితీగా పనిచేయాలని సూచించారు. 

వీవీ ప్యాట్‌ల్లోని లోపాలపై అధికారులు కమిషన్‌ బృందం దృష్టికి తీసుకొచ్చారు. బూత్‌లు, పోలీంగ్‌ కేంద్రాల వారిగా వివరాలను ఈసీఐ బృందం ఆరా తీసింది. ఓటర్ల జాబితాపై ఫిర్యాదులు రాకుండా పరిష్కారించాలని పేర్కొంది. మరోవైపు సమస్యాత్మక ప్రాంతాలు పెరగడంపై ఎన్నికల కమిషనర్‌ రావత్‌ అసహనం వ్యక్తం చేశారు. త్వరలో మళ్లీ రాష్ట్రానికి వస్తామని చెప్పారు.