Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్‌కు ఈసీ లేఖ.. రాష్ట్రం ప్లేస్‌లో ‘‘ఏపీ’’, సజ్జల వ్యాఖ్యల రోజే ఇలా : టీఆర్ఎస్ శ్రేణుల ఫైర్

తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదిస్తూ ఈసీ పంపిన లేఖలో తప్పు దొర్లింది. కేసీఆర్‌కు పంపిన లేఖలో టీఆర్ఎస్ ఆఫీస్ అడ్రస్‌లో రాష్ట్రం పేరులో తెలంగాణకు బదులు ఆంధ్రప్రదేశ్ అని రాసింది. 

ec sent letter to kcr, mentioned trs party address as andhra pradesh instead of telangana
Author
First Published Dec 8, 2022, 9:05 PM IST

టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మారుస్తూ ఈసీ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గులాబీ పార్టీ కేడర్‌కు ఈ న్యూస్ నిజంగా బూస్ట్ ఇచ్చేదే. రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటున్నాయి. రేపు బీఆర్ఎస్ ఆవిర్భావ కార్యక్రమానికి కూడా కేసీఆర్ పిలుపునిచ్చారు. రేపు ఈసీ పంపిన లేఖకు సంతకం చేసి రిప్లయ్ ఇవ్వనున్నారు ముఖ్యమంత్రి. అంతా బాగానే  వుంది కానీ.. ఈసీ పంపిన లేఖే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ లేఖను హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమితి అడ్రస్‌కే పంపింది. అయితే చిరునామాలోని రాష్ట్రం ప్లేస్‌లో తెలంగాణకు బదులు ఆంధ్రప్రదేశ్ అని రాసుకొచ్చింది. 

టీఆర్ఎస్ ఆవిర్భవించింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అయినా.. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిదేళ్లు దాటింది. అయినప్పటికీ ఈసీ తన వద్ద వున్న డేటాను అప్‌డేట్ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా ఆమోదించిన ఈసీ... రాష్ట్రాన్ని మాత్రం తెలంగాణగా గుర్తించలేదా అంటూ గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఇది కావాలని చేసిందా లేక సాంకేతిక సమస్యేనా అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నాయి. ఈ మేరకు ఈసీ పంపిన లేఖలో తెలంగాణ రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్‌ను హైలైట్ చేస్తూ ఎన్నికల సంఘంపై విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ అభిమానులు. ఏపీ, తెలంగాణలు మళ్లీ ఉమ్మడి రాష్ట్రంగా కలవాలంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈసీ చర్య రెండు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 

ALso REad:బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్.. రేపు ఆవిర్భావ సభ

ఇదిలావుండగా... తెలంగాణ రాష్ట్ర సమితి పేరును.." భారత్ రాష్ట్ర సమితి " గా ఆమోదిస్తూ.. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి టీఆర్ఎస్ అధినేత కెసిఆర్‌కు గురువారం అధికారికంగా లేఖ అందింది. ఈ నేపథ్యంలో .. రేపు మధ్యాహ్నం 1: 20 నిమిషాలకు "భారత రాష్ట్ర సమితి" ఆవిర్భావం కార్యక్రమం నిర్వహించాలని చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్లో రేపు ఒంటిగంట 20 నిమిషాలకు, తనకు అందిన అధికారిక లేఖకు కేసీఆర్ రిప్లై ఇవ్వనున్నారు. 

అనంతరం సీఎం కేసిఆర్ బిఆర్ఎస్ జండాను ఆవిష్కరిస్తారు. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో జరిగే కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లాల అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, హాజరుకావాలని ముఖ్యమంత్రి కోరారు. వీరితోపాటు.. జిల్లా పరిషత్ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డిసిసిబి అధ్యక్షులు డీసీఎంఎస్ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్యులు అందరూ శుక్రవారం మధ్యాహ్నం లోపు తెలంగాణ భవనకు చేరుకోవాలని కేసిఆర్ ఆదేశించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios