హైదరాబాద్‌: తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ప్రధాన ఘట్టం గురువారంతో ముగిసింది. నామినేషన్ల పర్వంలో భాగంగా కొన్ని చోట్ల రెబల్స్ బరిలోకి దిగారు. దీంతో పార్టీ అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు పావులు కదిపారు. దూతలను పంపించి బుజ్జగించారు కూడా.  

అయితే నామినేషన్ల ఉపసంహరణలో ఎవరు బరిలో ఉండేది ఎవరు పోయేది అనేది దానిపై ప్రజలతోపాటు అభ్యర్థులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెుత్తానికి అనుకున్నట్లుగానే నామినేషన్ల ఉపసంహరణ తేదీ వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో రెబల్స్ తన నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో రెబల్స్ బెడదతో ఆందోళనలో ఉన్న అభ్యర్థుల్లో కాస్త హుషారొచ్చింది. 

మెుత్తానికి అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో రాష్ట్రంలో ఎంతమంది అభ్యర్థులు బరిలో ఉన్నారనే అంశంపై స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో తిరుగుబావుటా ఎగురవేసిన నేతలతో ఆయా రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జరిపిన బుజ్జగింపులు ఫలించడంతో వారు ఈ రోజు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 

నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్యను ఈసీ ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు గాను 1824 మంది అబ్యర్థులు బరిలో నిలిచినట్లు వెల్లడించింది. తెలంగాణలోని ఉమ్మడి జిల్లాల్లో నియోజకవర్గాల ప్రకారం బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఓసారి చూద్దాం. 

హైదరాబాద్‌ జిల్లాలో 15 నియోజకవర్గాలకు గానూ 313 మంది అభ్యర్థులు బరిలో ఉండగా రంగారెడ్డి జిల్లాలో 17 నియోజకవర్గాలకు గాను 304 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలకు గానూ 133 మంది , కరీంనగర్‌ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 175 మంది అభ్యర్థులు బరిలో నిల్చున్నారు. 

నిజామాబాద్‌ జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 91 మంది అభ్యర్థులు, వరంగల్‌ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 172 మంది అభ్యర్థులు, నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో 211 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అలాగే మెదక్‌ జిల్లాలో 11 నియోజకవర్గాలకు గానూ 124 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, ఆదిలాబాద్‌ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో 123 మంది అభ్యర్థులు, చివరగా మహబూబ్‌నగర్‌ జిల్లాలో 11 నియోజకవర్గాల్లో 178 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 

అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో ప్రచారంలో మరింత జోరు పెంచనున్నారు. బరిలో ఉండేది ఎవరో తెలియడంతో ఆయా పార్టీల నేతలు ఇక ఎన్నికల ప్రచారం మోత మోగించేందుకు రెడీ అవుతున్నారు. ఇకపోతే ఎన్నికలు డిసెంబర్ 7న జరగగా డిసెంబర్ 11న ఫలితాలు విడుదల కానున్నాయి.

 

ఈ వార్తలు కూడా చదవండి

నామినేషన్లు గడువు ముగింపు:విత్ డ్రా చేసుకున్నఅభ్యర్థులు వీరే...

ముగిసిన గడువు: నామినేషన్లు ఉపసంహరించుకున్న రెబెల్స్