హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఉపసంహరణ గడువు గురువారంతో ముగియనున్ననేపథ్యంలో అన్ని పార్టీలు కలిసి రంగంలోకి దిగాయి. రెబల్స్ అభ్యర్థుల నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు ఆయా పార్టీల అధినేతలు బుజ్జగింపులకు రంగంలోకి దిగారు. 

ఈ నేపథ్యంలో అన్ని పార్టీల నుంచి గట్టి రెబల్స్ అభ్యర్థులు బరిలో నుంచి తప్పుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ తన నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద ప్రసాద్ కి లైన్ క్లియర్ అయ్యింది. 

ఇటీవలే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ను బుజ్జగించేందుకు పలువురు నేతలు బుజ్జగింపులకు రంగంలోకి దిగారు. బుజ్జగింపుల నేపథ్యంలో భిక్షపతియాదవ్ తన నామినేషన్ ను ఉపసంహరించుకుని మహాకూటమి అభ్యర్థి  భవ్య ఆనంద్ ప్రసాద్ కు మద్దతు ప్రకటించారు. భవ్య ఆనంద ప్రసాద్ గెలుపునుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  

అటు టీడీపీ రెబల్ అభ్యర్థి మువ్వ సత్యనారాయణ, టీఆర్‌ఎస్‌ రెబల్ శంకర్ గౌడ్ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. అలాగే మరో ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. అటు చేవెళ్లలో కాంగ్రెస్ అభ్యర్థి కేఎస్‌ రత్నం పాదాభివందనంతో  కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి వెంకటస్వామి దిగొచ్చారు. తన నామినేషన్ ను ఉపసంహరించుకుని కేఎస్ రత్నం గెలుపుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  

సంగారెడ్డి జిల్లా పరిధిలో పఠాన్‌చెరులో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు అంజి రెడ్డి, సహను దేవ్, కొలను బాల్ రెడ్డి, గాలి అనిల్ కుమార్, శశికళ యాదవ్ రెడ్డిలు నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. 

కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే బాన్సువాడ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థి మల్యాద్రి రెడ్డి తన నామినేసన్ ను ఉపసంహరించుకున్నారు. అలాగే ఎల్లారెడ్డి నియోజకవర్గం కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి, పైలా కృష్ణారెడ్డిలు తమ నామినేషన్ల ఉపసంహరించుకున్నారు. వీరితోపాటు ఇండిపెండెంట్ అభ్యర్థి నారాయణ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. 

ఇకపోతే నిజామాబాద్‌లో బీజేపీ రెబల్ అభ్యర్థి ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా తన నామినేషన్ ఉపసంహరించుకున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి అమరేందర్ రెడ్డి, టీజేఎస్ తిరుగుబాటు అభ్యర్థి విద్యాధరరావులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 

కరీంనగర్ జిల్లాలో హుజూరాబాద్‌లో తిరుగుబాటు అభ్యర్థులు బండి కళాధర్, మంథని ప్రశాంత్, ఈటల జమునతో పాటు మరో ఇద్దరు స్వతంత్రులు తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. 

మరోవైపు 504 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తవ్వడంతో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించనుంది. 

అనంతరం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా వివరాలను విడుదల చేయనున్నారు. ఈనెల 23 నుంచి ఓటర్ల స్లిప్పులు ఇంటింటికి పంపిణీ చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అలాగే మరికొద్ది రోజుల్లోనే బ్యాలెట్ ముద్రణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించింది. 

నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారం మరింత జోరందుకోనుంది. డిసెంబర్ 7న ఒకే దఫాలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 11న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి.