Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీకి విమానమెక్కిన ఈటల రాజేందర్: నేడు బిజెపిలోకి...

కొంత మంది ముఖ్య నేతలతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయన బిజెపి జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో కాషాయ కుండువా కప్పుకుంటారు.

Eatela Rajender to join in BJP today, leaves for Delhi
Author
Hyderabad, First Published Jun 14, 2021, 8:27 AM IST

హైదరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ సోమవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా ఢిల్లీ వెళ్లారు. ఈ రోజు ఉదయం 11.30 గంటలకు పార్టీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో ఈటల రాజేందర్ బిజెపిలో చేరనున్నారు. 

మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమతో పాటు ముఖ్య నేతలు దాదాపు 20 మంది వరకు బిజెపిలో చేరేందుకు ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జెపి నడ్డా అపాయింట్ మెంట్ తీసుకున్నారు. 

బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ లో ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆ సమయానికి ఢిల్లీ చేరే అవకాశం ఉంది. వారంతా తిరిగి మంగళవారం ఈ నెల 15వ తేదీ హైదరాబాదు తిరిగి రానున్నారు. 

ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు మాత్రమే కాకుండా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను వెంటనే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆమోదించడమే కాకుండా హుజురాబాద్ శాసనసభా నియోజకవర్గం ఖాళీ అయినట్లు ఎన్నికల కమిషనర్ కు తెలియజేశారు. దీంతో వచ్చే ఆరు నెలల్లోగా హుజూరాబాద్ శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నికల జరగాల్సి ఉంటుంది.

హుజూరాబాద్ కు సాధ్యమైనంత త్వరగా ఎన్నిక జరిగితే బాగుంటుందనే ఉద్దేశంతో బిజెపి రాష్ట్ర నాయకత్వం ఉంది. సమయం ఎక్కువగా ఇస్తే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పకడ్బందీ వ్యూహం రచించి, అమలుచేసే అవకాశం ఉంటుందని, అందువల్ల ఆయనకు సమయం తక్కువగా ఉంటే బాగుంటుందని భావిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios