హైదరాబాద్: ముఖ్యమంత్రి తనయుడు కేటీ రామారావు ముఖ్యమంత్రి అవుతారనే ప్రచారంపై మంత్రి ఈటెల రాజేందర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చునని, అందుకు రకరకాల కారణాలు ఉండవచ్చునని ఆయన అన్నారు. ఆదివారం రాత్రి ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇటర్వ్యూలో ఈటెల రాజేందర్ ఆ వ్యాఖ్యలు చేశారు. 

ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చునని, అందులో తప్పేముందని ఈటెల రాజేందర్ వ్యాఖ్యానించారు. కరోనా టీకా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరు కాకపోవడంపై రంధ్రాన్వేషణ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ వద్ద 99 శాతం కార్యక్రమాలు మంత్రి కేటీఆర్ చూస్తారని, మొన్న టీకా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారని, సంబంధిత శాఖ మంత్రిగా తాను ఉన్నానని ఆయన అన్నారు. 

సీఎం అందుబాటులో లేని పలు సందర్భాల్లో ఆ పాత్రను కేటీఆర్ పోషిస్తున్నట్లు ఆయన తెలిపారు. తనకు, సీఎం కేసీఆర్ కు మధ్య అంతరం ఏమీ లేదని, ఈ విషయంలో జరుగుతున్నదంతా ప్రచారం మాత్రమేనని ఆయన అన్నారు. తాను రాజకీయంగా సైలెంట్ అయిపోయినట్లు వార్తల్లో కూడా నిజం లేదని ఆయన చెప్పారు. 

మనిషి పాత్ర ఎప్పుడూ ఒకే రకంగా ఉండదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతెత్తి మాట్లాడడం, ప్రజల వైపు నిలబడడం అదో పాత్ర అని, మంత్రిగా ఉన్నప్పుడు తక్కువ మాట్లాడడం పనులు ఎక్కువగా చేయడం ఇదో పాత్ర అని ఆయన అన్నారు. 

పార్టీ ఎవరు పెట్టినా, జెండా ఎవరు తెచ్చినా, సమిష్టిగా పనిచేస్తేనే పార్టీ నిలుస్తుందని, ఇది ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదని ఈటెల అన్నారు. టీఆర్ఎస్ లో సంతృప్తిగా ఉన్నారా అని అడిగితే.. ఎప్పుడూ ఒకే రకంగా ఉంటామా, ఒకసారి ఉత్సాహంగా ఉంటాం, ఒకసారి బాధల్లో ఉంటామని ఆయన అన్నారు.