హుజురాాబాద్ లో తన వెంట వుంటున్న నాయకులు, బిజెపి కార్యకర్తలను మంత్రి హరీష్ పోలీసులను ఉపయోగించి వేధిస్తున్నాడని... ఈ వేధింపులు ఆపకుంటే ఆయన భరతం పడతామని ఈటల రాజేందర్ హెచ్చరించారు. 

కరీంనగర్: అధికారాన్ని అడ్డం పెట్టుకుని మంత్రి హరీష్ రావు రాత్రి పూట పోలీసులను బిజెపి నాయకుల ఇళ్లకు పంపి బెదిరిస్తున్నారని మాజీ మంత్రి, బిజెపి నాయకులు ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బిజెపిని, ఈటల రాజేందర్ ను వీడి టీఆర్ఎస్ లో చేరాలని బిజెపి కార్యకర్తలను సైతం బెదిరిస్తున్నారని... ఈ వేధింపులు ఆపకుంటే మీ భరతం పడతామంటూ మంత్రి హరీష్ ను హెచ్చరించారు ఈటల.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కమలాపూర్ లో జరిగిన గౌడ గర్జన సభలో కేంద్ర విదేశీ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ తో కలిసి పాల్గొన్నారు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఆంధ్రోడి చేతిలో కత్తి వుండేదని... దాంతో తెలంగాణ వాడిని పొడిచేదని కేసీఆర్ చెప్పేవాడని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కత్తి సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ చేతిలో వుంది... వీళ్లు కూడా మనోళ్లనే పొడుస్తున్నారని ఈటల అన్నారు. 

read more కష్టాల్లో కిషన్ రెడ్డి సోదరుడిలా అండగా నిలిచాడు: మందకృష్ణ మాదిగ

''ప్రగతి భవన్ నుండి కేసీఆర్ ఆదేశిస్తే హుజురాబాద్ లో హరీష్ ఆచరిస్తున్నారు. వీరి ఆదేశాలతోనే పోలీసులు బిజెపి నాయకులతో నా వెంట వుండేవారిని టీఆర్ఎస్ లో చేరాలని బెదిరిస్తున్నారు. కానీ నన్ను విడిచి టీఆర్ఎస్ లో చేరినవారి పరిస్థితి అధ్వాన్నంగా వుంది... దండం దొరా అనే బానిసలుగా మారింది. వీరికి జరుగుతున్న అవమానాలను చూసి ఎవ్వరూ టీఆర్ఎస్ లో చేరడానికి ఇష్టపడటం లేదు. అందువల్లే పోలీసుల బెదిరింపులు'' అని ఈటల పేర్కొన్నారు. 

''అధికారం వుందని సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. కానీ కేసీఆర్‌ అధికారం 2023 వరకే ఉంటుంది. ఆ తర్వాత వీరి పరిస్థితి, వీరికి సహకరిస్తున్న అధికారుల పరిస్థితి ఏంటి'' అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.