Asianet News TeluguAsianet News Telugu

ఈసి పరిస్థితి ఇదీ: తెలంగాణలో ముందస్తు సాధ్యమేనా?

తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ (ఈసి) సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. శాసనసభను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ నెల 6వ తేదీన రద్దు చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. 

Early Telangana dates: Election Commission to consider 6-month rule and election gap
Author
Hyderabad, First Published Sep 4, 2018, 10:41 AM IST

హైదరాబాద్: తెలంగాణ శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్ (ఈసి) సిద్ధంగా లేనట్లు కనిపిస్తోంది. శాసనసభను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఈ నెల 6వ తేదీన రద్దు చేయడానికి సిద్ధపడినట్లు వార్తలు వస్తున్నాయి. మంత్రివర్గ సమావేశంలో 6వ తేదీన శాసనసభ రద్దకు నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు. కానీ, గడువులోగా ఎన్నికలు నిర్వహించడానికి తాము తగిన ఏర్పాట్లు చేసుకోలేమని ఈసి చెబుతున్నట్లు సమాచారం.

నిజానికి నిర్ణీత గడువు ప్రకారం, వచ్చే ఏడాది ఏప్రిల్, మే మాసాల్లో లోకసభ ఎన్నికలతో పాటు తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరుగుతాయి. సెప్టెంబర్ లో శాసనసభను రద్దు చేస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఫిబ్రవరిలో నిర్వహించాల్సి వస్తుంది. నిర్ణీత గడువుకు, దీనికి మధ్య వ్యవధి పెద్దగా లేదు. 

అయితే, డిసెంబర్ నాలుగు రాష్ట్రాలకు జరిగే ఎన్నికలతో పాటు తెలంగాణకు కూడా ఎన్నికలు నిర్వహించడానికి వీలు కాదనే ఉద్దేశంతో ఈసి ఉంది. అందుకు తగిన కారణాలను కూడా చూపుతోంది. ఒక్కటి ఆరు నెలల గడువు తీసుకోదలిస్తే ఈసి ఫిబ్రవరిలో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు నిర్వహించాల్సి వస్తుంది. 

మరో విషయం ఏమిటంటే, నవంబర్ - డిసెంబర్ నెలల్లో నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు ఈసి సర్వం సిద్ధం చేసుకుంది. ఈ స్థితిలో ఆ రాష్ట్రాలతో పాటు తెలంగాణ ఎన్నికలు నిర్వహించడానికి తగిన ఏర్పాట్లు విడిగా చేసుకోవాల్సి వస్తుంది. 

ఓ ఎన్నికల ఫలితాల ప్రభావం మరో ఎన్నికలపై పడకుండా చూడడానికి తగిన వ్యవధిని ఈసి తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే వెంటనే మరో ఎన్నికను నిర్వహించడం భావ్యం కాదనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఈ స్థితిలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ గడ్, మిజోరం ఎన్నికలతో పాటు తెలంగాణకు ఎన్నికలు నిర్వహించడానికి ఈసి ఏ మాత్రం సంసిద్ధంగా లేదని అంటున్నారు. ఎన్నికల నిర్వహణకు పెద్ద యెత్తున ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం ఈసి ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎన్నికలకు జరిగిన ఏర్పాట్లను పర్యవేక్షించి, పరిశీలించడదానికి చీఫ్ ఎలక్షన్ కమిషన్, ఇద్దరు కమిషనర్లు మూడు సార్లు ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. 

కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు రాజీవ్ శర్మ ఇటీవల నిర్వాచన్ సదన్ కు వచ్చి ఇద్దరు కమిషనర్లతో భేటీ అయ్యారు. ముందస్తు ఎన్నికల నిర్వహణ కోసమే ఆయన వారిని కలిశారనే ప్రచారం జరిగింది. అయితే, తాను అందుకు రాలేదని ఆయన చెప్పారు. శాసనసభ రద్దు విషయమై గానీ శాసనసభకు ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని గానీ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈసికి ప్రతిపాదన పంపించలేదు. 

శాసనసభను రద్దు చేసిన తర్వాతనే ఈసి ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల తెలంగాణ శాసనసభను కేసిఆర్ ముందుగానే రద్దు చేస్తారా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికి ఈసి సిద్ధం కాలేదని మాత్రం అర్థమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios