హైదరాబాద్ లో గత సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ఓ వ్యక్తి మృతి చెందాడు. ముషీరాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్  సెల్లార్ లో హై కోర్ట్ ఉద్యోగి రాజ్ కుమార్ విద్యుత్ షాక్ తో మృతి చెందాడు. 

భారీ వ‌ర్షాల కార‌ణంగా ముషీరాబాద్ కేర్ ఆస్పత్రి ఎదురుగా సికింద్రాబాద్ కోపరేటివ్ బ్యాంకు బుడగల అపార్ట్‌మెంట్‌లోకి  వ‌ర్షం నీరు భారీగా చేరింది. సెల్లార్ లోనే కరెంట్ మీటర్లు ఉండడం.. రాజ్ కుమార్ అనే 54 యేళ్ల వ్యక్తి సెల్లార్ లో చిక్కుకునిపోవడంతో.. అతను ప్రాణాలు కోల్పోయాడు. సెల్లార్ లో గ్రిల్స్ పట్టుకోవడంతో చనిపోయాడు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందని సమాచారం. 

ఈయ‌న హైద‌రాబాద్ హైకోర్టులో ప‌నిచేస్తున్నారు. పది రోజుల క్రిందట రాజ్ కుమార్ తల్లి మరణించారట. ఇప్పుడు రాజ్ కుమార్ మరణించడంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బాలికతో సహా ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.