దుబ్బాక: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ను దెబ్బ కొట్టేందుకు బిజెపి నాయకులు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను చివరి అస్త్రంగా ప్రయోగించాలని యోచిస్తున్నారు. దుబ్బాకలో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు తరఫున పవన్ కల్యాణ్ తో ప్రచారం చేయించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి నాయకులు కొంత మంది ఆ విషయంపై పవన్ కల్యాణ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

బిజెపితో పవన్ కల్యాణ్ జనసేన పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తెలంగాణలో పవన్ కల్యాణ్ కు పెద్ద యెత్తున అభిమానులు ఉన్నారు. ప్రత్యేకంగా యువతలో ఆయనకు క్రేజ్ ఉంది. దాన్ని దుబ్బాక ఎన్నికల్లో వాడుకోవాలని బిజెపి నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి, టీడీపి కూటమికి మద్దతుగా పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన విషయం తెిలిసందే. ఆ తర్వాత ఆయన టీడీపీ, బిజెపికి దూరమయ్యారు. గత ఎన్నికల్లో ఒంటరిగానే జనసేన పోటీ చేసింది. అయితే, ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో పవన్ కల్యాణ్ టీడీపీకి దూరమై బిజెపితో పొత్తు పెట్టుకున్నారు. 

జనసేన, బిజెపి పొత్తు ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదని, తెలంగాణలో ఆ పొత్తు ఉంటుందని గతంలో ప్రకటనలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ తో దుబ్బాకలో ప్రచారం చేయించాలని బిజెపి నాయకులు పవన్ కల్యాణ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

తద్వారా తెలంగాణలో కూడా చురుకైన పాత్ర పోషించడానికి జనసేన సిద్దపడుతుందని అంటున్నారు. గ్రేటర్ హైదరాబాదు నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ) ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో పవన్ కల్యాణ్ దుబ్బాక ప్రచారం ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూటమి మంచి ఫలితాలు సాధించడానికి వీలవుతుందని అంటున్నారు. 

అయితే, పవన్ కల్యాణ్ దుబ్బాకలో నేరుగా ప్రచారం చేస్తారా, లేదా అనే ప్రశ్నకు కచ్చితమైన సమాధానం దొరకడం ఇప్పటికిప్పుడైతే కష్టమే. చివరి నిమిషంలో ఆయన దుబ్బాక ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసే అవకాశాలు కూడా లేకపోలేదని అంటున్నారు.