దుబ్బాకలో అధికార తెరాస కు షాక్ ఇస్తూ... బీజేపీ ఉప ఎన్నికను గెలిచి రికార్డు సృష్టించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 1400 పైచిలుకు ఓట్ల తేడాతో విజయం సాధించి తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై గెలుపొందారు. 

దుబ్బాక సంస్థాగతంగా తెరాస కంచుకోట. 2014 నుంచి తెరాస అక్కడ గెలుస్తూ వస్తుంది. దానితోపాటుగా తెరాస లోని ఒక ప్రధానమైన మాస్ లీడర్ హరీష్ రావు సొంత జిల్లాలో ఉంది దుబ్బాక. జిల్లా అంతా గులాబీమయం. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ తెరాస. బీజేపీ అంతంతమాత్రంగా ఇంకా తమ బలం నిరూపించుకునే పనిలోనే ఉన్న పార్టీ. 

సాధారణంగా ఉపఎన్నికలు అధికార పార్టీకి నల్లేరు మీద నడకగా అందరూ చెబుతూ ఉంటారు. అందునా ప్రస్తుత పరిస్థితుల్లో తెరాస కు అక్కడ ఎదురు ఉండకూడదు. రాష్ట్రంలోని ప్రధాన నాయకులూ, మంత్రులు అంతా అక్కడ క్యాంపులు వేసి మరీ రేయింబవళ్లు కష్టపడ్డారు. ఈ పరిస్థితుల్లో అక్కడ తెరాస దే విజయం అని అంతా భావించారు. 

కానీ అనూహ్యంగా అక్కడ హొరాహొరిపోరులో బీజేపీ విజయం సాధించింది. ఈ దుబ్బాక విజయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఒక నూతన ఒరవడిని సృష్టించే అవకాశం కనబడుతుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా బలహీనపడడంతో కేసీఆర్ కి ధీటైన మరో బలమైన నేత కనబడడం లేదు. 

రేవంత్ రెడ్డి కేసీఆర్ కి ధీటుగా కనబడుతున్నప్పటికీ... అతడి చేతిలో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు లేకపోవడం, కాంగ్రెస్ పార్టీయే నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతుండడం అన్ని వెరసి రేవంత్ రెడ్డికి కావలిసినంత పుష్ లభించలేదు. ఇక ఇదే సమయంలో అనూహ్యంగా కరీంనగర్ నుంచి ఎంపీగా గెలుపొందిన బండి సంజయ్ స్క్రీన్ మీదకు వచ్చారు. 

కేసీఆర్ ను ఢీ అంటే ఢీ అనడంతోపాటుగా కేసీఆర్ కి ధీటుగా రాష్ట్రంలో తన వాణిని వినిపించగలిగాడు. కేంద్రంలో కూడా బీజేపీ అధికారంలో ఉండడంతో.... ఆ అంశం కూడా కలిసి వచ్చిన బండి సంజయ్, ప్రతిసారి కేసీఆర్ కి పక్కలో బల్లెంగా మారుతున్నాడు. 

2019 పార్లమెంటు ఎన్నికలకు ముందు తెరాస కు బీజేపీకి అప్రకటిత మైత్రి ఉండేదనేది బహిరంగ రహస్యం. ఆ తరువుబాథ పార్లమెంటు ఎన్నికల్లో నాలుగు సీట్లు గెలిచినా బీజేపీ ఇక్కడ పాగా వేయాలని నిశ్చయించుకుంది. ఈ సమయంలో పాత తరం నాయకులను పక్కకు తప్పించి బండి సంజయ్ రూపంలో బీసీ యువ నేతను అధ్యక్షుడిగా చేసింది బీజేపీ. ఇక అప్పటినుండి మొదలు బీజేపీ దూసుకుపోతూనే ఉంది. 

బండి సంజయ్ అధ్యక్షుడయిన తరువాత తొలి ఎన్నికలోనే బీజేపీని విజయతీరాలకు చేర్చాడు. ఈ ఎన్నిక ఫలితం ద్వారా బీజేపీ కౌంట్ అసెంబ్లీ లో 2 గా మారడం మాత్రమే కాదు, బీజేపీ అదృష్టమే మారిపోతుందని వారు విశ్వసిస్తున్నారు. మొత్తానికి బండి సంజయ్ తన దూకుడుతో కేసీఆర్ కి రానున్న కాలంలో కొరకరాని కొయ్యగా మారే ఆస్కారం కనబడుతుంది.