దుబ్బాక ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కయ్యి, వెన్నుపోటు రాజకీయాలకు తెరతీస్తున్నాయంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దుబ్బాకలో కాంగ్రెస్‌ను ఎదుర్కోలేక రెండు పార్టీలు కుమ్మక్కయ్యాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. వెన్నుపోటు రాజకీయాలకు తెర తీశారని ధ్వజమెత్తారు. 

మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డిపై టీఆర్ఎస్, బీజేపీ తప్పుడు ప్రచారాలకు తెగబడ్డాయని మండిపడ్డారు. ఫేక్ న్యూస్‌లను వ్యాప్తి చేస్తూ ప్రజలలో గందరగోళాన్ని సృష్టించే కుట్రకు బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు సిద్ధపడ్డాయన్నారు. 

ఫేక్ న్యూస్ వ్యాప్తి వెనుక హరీష్ రావు, రఘునందన్ ఉన్నారని రేవంత్ ఆరోపించారు. తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. ప్రజలు అనవసర గందరగోళాలకు గురి కావద్దని, దుష్ర్ఫచారాలపై అప్రమత్తంగా ఉండాని రేవంత్ సూచించారు. ప్రజలంతా స్వేచ్ఛగా ఓటేయాలని కోరారు.

దుబ్బాకలో ఈ ఉదయం ఉపఎన్నిక పోలింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దుబ్బాక ఎన్నికల బరిలో 23 మంది అభ్యర్థులున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 1,98,756 మంది ఓటర్లున్నారు. నేటి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ కొనసాగనుంది. ఉపఎన్నిక సందర్భంగా దుబ్బాకలో 144 సెక్షన్‌ కొనసాగుతోంది.