హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలపై దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం ఉంటుందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అభిప్రాయపడ్డారు.

తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉప ఎన్నికల  సమయంలో తనపై పెట్టిన కేసులపై న్యాయస్థానంలో పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. నమ్మినసిద్దాంతం కోసం పోరాడితే ఆలస్యంగానైనా విజయం దక్కుతోందని తన విషయంలో నిరూపితమైందన్నారు.

దుబ్బాక ఫలితమే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. తన గెలుపు కోసం అహర్నిశలు పోరాటం చేసిన  ప్రతి ఒక్క కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్టుగా ఆయన చెప్పారు.

టీఆర్ఎస్ లో 30 నుండి 60 మంది అసంతృప్తులున్నారని ఆయన చెప్పారు.వీరంతా బీజేపీలోకి రావాలని ఆయన కోరారు.హైద్రాబాద్ లో కాషాయ జెండా ఎగురవేసేందుకు తన శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆయన చెప్పారు. పదవులున్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే తత్వం తనదని ఆయన చెప్పారు.

గ్రేటర్ ఎన్నికలను ఎదుర్కోవడానికి తమ వద్ద ప్రత్యేక ప్రణాళికలున్నాయన్నారు. వరద సహాయాన్ని టీఆర్ఎస్ ఓట్ల కొనుగోలుకు మార్చుకొందని ఆయన ఆరోపించారు. రూ. 2 లక్షల కంటే ఎక్కువ డబ్బులు డ్రా చేసిన జోనల్ కమిషనర్లను కోర్టుకు ఈడ్చుతామని ఆయన హెచ్చరించారు.

బీజేపీని రఘునందన్ రావు వేరుగా చూడొద్దని ఆయన కోరారు. చచ్చేదాకా బీజేపీని వీడేదీ లేదన్నారు.