సిద్ధిపేట: తెలంగాణ మంత్రి హరీష్ రావుకు టీఆర్ఎస్ లో ట్రబుల్ షూటర్ అనే పేరుంది. ఏ ఎన్నికను అప్పగించినా ఆయన విజయం సాధించి పెడుతూ వస్తారని పేరుంది. సంగారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో తప్ప ఇప్పటి వరకు ఆయన తనకు అప్పగించిన బాధ్యతను నిర్వహించి విజయాలు సాధించి పెడుతూ వచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం మాత్రం హరీష్ రావుకు ఎదురులేని దెబ్బనే.

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతను గెలిపించడానికి సర్వశక్తులూ ఒడ్డారు. ఉప ఎన్నికను మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. ఊరూరా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. బిజెపి విమర్శలను తిప్పికొడుతూ వచ్చారు. కానీ విజయం స్వల్ప మెజారిటీతో ముఖం చాటేసింది. 

ఉప ఎన్నిక విషయంలో బిజెపి తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తన ప్రచారంలో ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. దుబ్బాకలో టీఆర్ఎస్ విజయం సాధించడం ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇష్టం లేదని అన్నారు. దుబ్బాకలో టీఆర్ఎస్ ఓడిపోతే హరీష్ రావును వెనక్కి నెట్టడానికి కేసీఆర్ అవకాశం లభిస్తుందని ఆయన అన్నారు. 

దుబ్బాకలో ఓడిపోయిన తర్వాత తన కుమారుడు కేటీఆర్ కు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తారని ఆయన కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. దుబ్బాకలో గ్రౌండ్ క్లియర్ గా ఉందని, తమ విజయం ఖాయమని కేసీఆర్ ఓ సభలో అన్నారు. అయితే, కేసీఆర్ చెప్పినట్లు జరగలేదు. బిజెపి తన సత్తా చాటి టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చి విజయం సాధించింది. 

దుబ్బాక ఎన్నికలను ముఖ్యమంత్రి కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ పెద్దగా పట్టించుకున్నట్లు లేదు. అంతా హరీష్ రావుకే అప్పగించారు. దాంతో ఓటమి బాధ్యతను హరీష్ రావు తీసుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. 

ఉప ఎన్నికలో టీఆర్ఎస్ కు సోలిపేట రామలింగా రెడ్డి మరణించిన సానుభూతి కూడా పనికి రాలేదు. సాధారణంగా ఫలితం మరణించిన ప్రజాప్రతినిధి కుటుంబానికి అనుకూలంగా ఉప ఎన్నిక ఫలితం వస్తుంది. కానీ, దుబ్బాకలో అది జరగలేదు.

పైగా,  బిజెపి అభ్యర్థి రఘునందన్ రావుకు సానుభూతి కలిసి వచ్చిందని అంటున్నారు. గతంలో రెండు సార్లు ఓడిపోవడంతో రఘునందన్ రావుకు ఈ ఎన్నికల్లో ఆ సానుభూతి పనికి వచ్చిందని చెబుతున్నారు.