Asianet News TeluguAsianet News Telugu

ఇరు రాష్ట్రాల పోలీసులు మళ్లీ కొట్టుకోకూడదనే: గెజిట్ నోటిఫికేషన్‌పై రఘునందన్ వ్యాఖ్యలు

రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం, వివాదాలు పెద్దవి చేయకూడదనే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన స్పష్టం చేశారు. నదీ జలాల విషయాన్ని తెలంగాణ రాజకీయం చేయాలనుకుంటుందని దుబ్బాక ఎమ్మెల్యే విమర్శించారు.

dubbaka bjp mla raghunandan rao comments on trs and harish rao on krishna waters issue ksp
Author
Hyderabad, First Published Jul 16, 2021, 3:35 PM IST

విభజన చట్టం ప్రకారమే కృష్ణ, గోదావరి నదీ జలాల బోర్డుల నోటిఫికేషన్ జరిగిందన్నారు దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు . తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాలు పెరగకుండా కేంద్రం కృష్ణా, గోదావరి బోర్డులను నోటిఫై చేయడం ఉపయోగపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని.. నీటి కేటాయింపుల విషయంగా చూడకూడదన్న రఘునందన్ రావు, ఇప్పటికే కేటాయించిన నీటిని బోర్డుల ద్వారా జరిగే నిర్వహణగా చూడాలని సూచించారు.

విద్యుత్ ఉత్పత్తి, అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారని ఇరు తెలుగు రాష్ట్రాలు కేంద్రానికి లేఖలు రాస్తున్న నేపథ్యంలో కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని రఘునందన్ రావు వివరణ ఇచ్చారు. రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకోవడం, వివాదాలు పెద్దవి చేయకూడదనే కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసిందని ఆయన స్పష్టం చేశారు. నదీ జలాల విషయాన్ని తెలంగాణ రాజకీయం చేయాలనుకుంటుందని దుబ్బాక ఎమ్మెల్యే విమర్శించారు.

Also Read:సుదీర్ఘ కసరత్తు చేశాకే బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు: కేంద్ర జల్ శక్తి జాయింట్ సెక్రటరీ సంజయ్ అవస్తీ

తెలంగాణా నీటి ప్రయోజనాల విషయంలో ఏడేళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉందని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. 2015లో కృష్ణా నదీజలాల వాటాను ఏపీకి 66% తెలంగాణాకి 34% కింద హరీశ్ రావు ఒప్పుకున్నారు కాబట్టే.. ఇప్పుడు కేంద్రాన్ని అడగడానికి ఆయనకు ముఖం చెల్లడం లేదంటూ ఆయన దుయ్యబట్టారు. నీటి విషయంలో తెలంగాణ బీజేపీని బద్నాం చేయాలని టిఆర్ఎస్ చూస్తుందని రఘునందన్ విమర్శించారు.

ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు, సమస్యల పరిష్కారం కోసం అపెక్స్ కౌన్సిల్ ముందుకు వచ్చి తమ వాదాన్ని కేసీఆర్ సర్కారు వినిపించాలని కోరారు. ఇప్పటి వరకు జల వివాదాల విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని రఘునందన్ రావు చెప్పుకొచ్చారు. కేంద్రం జోక్యం తరువాత మాటమార్చి సుప్రీంకోర్టుకు వెళ్తామంటున్నారని, ప్రజాస్వామ్య బద్దంగా తెలంగాణా ప్రభుత్వం తీసుకునే ఏ చర్యనైనా తాము స్వాగతిస్తామని రఘునందన్ రావు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios