హైదరాబాద్: తనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ఫిర్యాదు చేస్తే చేసుకోనివ్వండి అని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) రాజ్యసభ సభ్యుడు డి. శ్రీనివాస్ అన్నారు. ఢిల్లీ నుంచి బుధవారం తిరిగి వచ్చిన ఆయన తనపై నిజామాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసిఆర్ కు ఫిర్యాదు చేసిన విషయంపై స్పందించారు.

తాను టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదని అన్నారు. తాను టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా ఏ విధమైన కార్యకలపాలకు పాల్పడలేదని చెప్పారు. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ విధానాలకు కట్టుబడి ఉన్నానని, ఆ పార్టీలకు వ్యతిరేకంగా ఏనాడూ పనిచేయలేదని ఆయన అన్నారు .

డిఎస్ పై నిజామాబాద్ ఎంపీ కవితతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కేసిఆర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వారు కేసిఆర్ కు నాలుగు పేజీల లేఖ రాశారు.