Asianet News TeluguAsianet News Telugu

కాంగ్రెస్ గూటికి డీఎస్.. పచ్చజెండా ఊపిన అధిష్టానం

 కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం డీఎస్ రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎస్ వస్తే పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. 

DS re joins in congress party?
Author
Hyderabad, First Published Sep 5, 2018, 2:01 PM IST

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్ మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరనున్నారా..? అవుననే వార్తలే ఎక్కువగా వినపడుతున్నాయి. కాంగ్రెస్ లో ఎన్నో సంవత్సరాలుగా పనిచేసిన డీఎస్.. గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. అయితే.. తనపై పార్టీ పలు ఆరోపణలు చేయడంతో.. తనను పార్టీ నుంచి తొలగించాలని ఆయనే స్వయంగా కోరారు.

‘నేను రాజీనామ చేయను.. దయచేసి నన్ను సస్పెండ్‌ చేయండి. లేకుంటే తీర్మానం వెనక్కి పంపండి’అని మీడియా ఎదుట టీఆర్ఎస్ కి సవాలు విసిరారు. ఆయన అలా అన్నారో లేదో.. ఇక డీఎస్ కాంగ్రెస్ లో చేరుతున్నారనే ప్రచారం మొదలైంది.  త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియాలను డీఎస్‌ కలవనున్నారని, ఆయన చేరికకు అధిష్టానం కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న సోనియా, రాహుల్‌ సమక్షంలో ఎమ్మెల్సీ భూపతి రెడ్డితో పాటు డీఎస్‌ కాంగ్రెస్‌లో చేరనున్నారని ఆయన వర్గీయులు తెలుపుతున్నారు.

డీఎస్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఎంపీ కవితతో పాటు పార్టీ జిల్లా ప్రజాప్రతినిధులు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై డీఎస్‌ స్పందిస్తూ మనసులో ఏదో పెట్టుకుని.. నిరాధారమైన ఆరోపణలతో తనను రాజకీయంగా దెబ్బతీయడమే కాకుండా, తన కుటుంబాన్ని రోడ్డుకు ఈడ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. లేనిపోనివి కల్పించి.. అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెచ్చి తన కుమారుడు సంజయ్‌పై కేసు పెట్టించారన్నారు. తన రెండో కుమారుడు ధర్మపురి అర్వింద్‌ బీజేపీలో చేరడం అతని స్వీయ నిర్ణయమని చెప్పారు. ఇందులో తన ప్రమేయం లేదన్నారు. అర్వింద్‌ బీజేపీలోకి వెళుతున్నారనే విషయం ముందుగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రెండు సార్లు వివరించానని, ఆయన సీరియస్‌గా తీసుకోలేదని స్పష్టం చేశారు.

తన యాభై ఏళ్ల రాజకీయ జీవితంలో క్రమశిక్షణకు మారుపేరుగా బతికానని చెప్పుకొచ్చా రు. ఎంపీ కవిత, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తనపై లేనిపోని అభండాలు వేసి పార్టీ వ్యతిరేకిగా ముద్రవేసి పార్టీ నుంచి బహిష్కరించాలని తీర్మానం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన విషయంలో సీఎం కేసీఆర్‌ స్పందించని పక్షంలో సరైన సమయంలో.. సందర్భాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానన్న డీఎస్‌ కాంగ్రెస్ లో చేరడం ఖాయమనిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం డీఎస్ రాకను వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. డీఎస్ వస్తే పార్టీలో తమకు ప్రాధాన్యత తగ్గిపోతుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. 

Follow Us:
Download App:
  • android
  • ios