అర్థరాత్రి సమయంలో ఓ యువతి నడి రోడ్డుపై నానా హంగామా సృష్టించింది. తాగిన మత్తులో తానేం చేస్తుందో మరిచి బుధవారం నడిరోడ్డుపై విచిత్రంగా ప్రవర్తించింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులతో కూడా దురుసుగా ప్రవర్తించి కాస్సేపు గందరగోళానికి కారణమయ్యింది. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఈ సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఎస్సార్ నగర్ చౌరస్తా ప్రాంతంలో  తాగిన మత్తులో ఓ యువతి ఒంటరిగా తిరగడాన్ని స్థానికులు గుర్తించారు. ఆమె వివరాలను తెలుసుకోడానికి ప్రయత్నించగా వారితో దురుసుగా ప్రవర్తించింది. దీంతో చేసేదేమిలేక వారు పోలీసులకు సమాచారం  అందించారు. 

దీంతో పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకుని యువతి  వివరాలను సేకరించే ప్రయత్నం చేశారు. అందుకు ఆమె సహకరించకపోవడంతో పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ ఆమె పోలీసులతో విచిత్రంగా ప్రవర్తించింది. కనిపించిన ప్రతి పోలీసులు బావా అని సంబోదిస్తూ అసభ్యకరంగా వ్యవహరించింది. ఆమె మద్యం మత్తులో వుంది కాబట్టి పోలీసులు కూడా ఆమె పిచ్చి చేష్టలను భరించారు. 

1088 సిబ్బంది సాయంతో ఆమె మద్యం మత్తు దిగేలా చేశారు. ఆ  తరువాత ఆమె వివరాలను సేకరించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మరోసారి ఇలా ప్రవర్తిస్తే కఠినంగా వ్యవహరిస్తామని సదరు మహిళను హెచ్చరించి అక్కడినుండి పంపించేశారు.