ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి డ్రంకెన్ డ్రైవింగ్ చేసిన యువకుడికి కోర్టు వెరైటీ శిక్ష విధించింది. సిగ్నల్ వద్ద నిలబడి ట్రాఫిక్ విధులు నిర్వర్తించడంతో పాటు 3 వేలు జరిమానా సైతం విధించింది.
డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి అంశాలపై (traffic rules) ట్రాఫిక్ పోలీసులు (hyderabad traffic police) సీరియస్‌గా దృష్టి పెడుతున్నారు. ఇప్పటి వరకు మాటలతో చెప్పి చూసిన పోలీసులు... ఇకపై యాక్షన్‌లోకి దిగినట్లుగానే కనిపిస్తోంది. దీంతో డ్రంకెన్ డ్రైవ్‌లో (drunk and drive) పట్టుబడిన వారికి బుద్ధి వచ్చేలా తాజాగా ఒకరికి ట్రాఫిక్ విధులు నిర్వహించాలంటూ కోర్టు శిక్ష విధించింది. ఐదు రోజుల పాటు ఆ బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఆ మందుబాబు రూ.3 వేల జరిమానా కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఈ సంఘటన జరిగింది ఎక్కడో కూడా హైదరాబాద్‌లోనే.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల తన్నీరు ఏసుబాబు అనే యువకుడు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి కమాన్ వద్ద ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డాడు. దీంతో అతడిని పోలీసులు ఎల్బీనగర్ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు విధించిన శిక్ష ప్రకారం.. ట్రాఫిక్ పోలీసులు ఆ యువకుడిని ప్రస్తుతం ఉప్పల్ రింగురోడ్డులో ట్రాఫిక్ విధుల్లో నియమించారు. కోర్టు ఆదేశాల మేరకు ఏసుబాబు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద నిలబడి, వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించకుండా చూసుకుంటున్నాడు.
కాగా.. Hyderabad నగరంలో మద్యం మత్తులో ఇటీవల కాలంలో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమౌతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. హోళీ పండుగ రోజున అంతకు ముందు రోజున హైద్రాబాద్ నగరంలో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు నగర వాసుల్ని భయబ్రాంతులకు గురి చేశాయి. ఈ నెల 17వ తేదీన రాత్రి జూబ్లీహిల్స్ వద్ద కారు ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో రెండు మాసాల చిన్నారి మరణించింది. మరో ముగ్గురు గాయపడ్డారు. బోధన్ ఎమ్మెల్యే కజిన్ మీర్జాతో పాటు ఆయన కొడుకును ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఎమ్మెల్యే కొడుకు రాహిల్ కూడా ఉన్నారని పోలీసులు గుర్తించారు.
ఈ నెల 18న గచ్చిబౌలి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. జూనియర్ ఆర్టిస్ట్ గాయత్రి తన స్నేహితుడు రోహిత్‌తో కలిసి ప్రిసమ్ పబ్ నుండి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. అతి వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదానికి కారణమని తమ ప్రాథమిక విచారణలో తెలిసినట్లు పేర్కొన్నారు. అతివేగంగా వచ్చిన వీరి కారు ఎల్లా హోటల్ ముందు ఫుట్‌పాత్‌ను ఢీ కొట్టి గాల్లోకి ఎగిరిపడింది.
ఈ ప్రమాదంలో ఆ దగ్గర్లోనే గార్డెనింగ్ పనులు చేస్తున్న మహేశ్వరి(38)ని ఢీకొట్టడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన రోహిత్, జూనియర్ ఆర్టిస్ట్, యూట్యూబర్ గాయత్రిని గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే గాయత్రి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ నెల 21న ట్యాంక్ బండ్ పై విధులు నిర్వహిస్తున్న ముషీరాబాద్ సీఐ జహంగీర్ యాదవ్ ను కారు ఢీకొట్టింది. వాహనాలు తనిఖీ చేస్తున్న జహంగీర్ ను వెనుక నుండి వస్తున్న కారు అతి వేగంగా వచ్చి ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో జహంగీర్ తీవ్రంగా గాయపడ్డారు.
