హైదరాబాద్‌: ఇక మద్యంతాగి వాహనం నడిపితే జైలు శిక్ష అనుభవించాల్సిందే. హైదరాబాద్ లో మద్యంతాగి వాహనం నడిపిన ఓ వ్యక్తికి మొదటి సారిగా కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది ఆగస్టు నెలలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2,524 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. మందుబాబులను నాంపల్లిలోని 3వ, 4వ మెట్రోపాలిటన్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. 

వారిలో 402 మందికి కోర్టు జైలు శిక్ష విధించింది. అయితే మందుబాబుల్లో ఒకరికి మూడు నెలలు, నలుగురికి రెండు నెలలు, ఇద్దరికి నెలరోజులు, జైలు శిక్ష విధించింది. మిగిలిన వారికి 2నుంచి 15 రోజుల వరకు జైలు శిక్ష విధించింది. శిక్ష పడ్డ మందుబాబులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే 17 మంది డ్రైవింగ్‌ లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేయగా,  75 మంది లైసెన్సులు ఆరు నెలల నుంచి 7 ఏళ్ల వరకు కోర్టు రద్దు చేసింది. 2,122 మందిపై రూ.54,28,300 అపరాధ రుసుమును కోర్టు విధించినట్లు ట్రాఫిక్‌ అదనపు పోలీస్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు.