వారిద్దరు ప్రేమించుకున్నారు. కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి బంధంతో ఒక్కటై ఆనందంగా జీవిస్తున్న వారి  కాపురంలో వరకట్నం చిచ్చు పెట్టింది. తల్లి మాటలు విని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించినవాడే వరకట్నం కోసం వేధించడాన్ని తట్టుకోలేక ఓ వివాహిత  ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద సంఘటన సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

సిరిసిల్ల పట్టణ సమీపంలోని వట్టెంల గ్రామానికి చెందిన రవళి, శ్రవణ్ ప్రేమించుకున్నారు. వీరి పెళ్లిక పెద్దలు అంగీకరించకపోవడంతో వారికి దూరంగా వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఈ జంట సిరిసిల్ల పట్టణంలోని గాంధీనగర్ లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని జీవిస్తున్నారు. 

కొంతకాలం సాఫీగా సాగిన వీరి కుటుంబంలోకి శ్రవణ్ తల్లి ప్రవేశించింది. కొడుకును మాయమాటలతో తన వైపు తిప్పుకుని వరకట్నం కోసం కోడలిని వేధించడం ప్రారంభించింది. కొద్దిరోజుల తర్వాత శ్రవణ్ కూడా తల్లితో కలిసి రవళిని కట్నం కోసం వేధించసాగాడు.

దీంతో పుట్టింటికి వెళ్లి కట్నం తేలేక, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు పెట్టే బాధలను తట్టుకోలేక రవళి దారుణమైన నిర్ణయం తీసుకుంది. సోమవారం రాత్రి  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 

ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న సిరిసిల్ల పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తమ కూతురిని ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని...కట్నం కోసం శ్రవణే హత్య చేశాడని రవళి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు ఫిర్యాదు చేయడంతో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.